ఇన్నర్ వేర్స్ పై క్యూఆర్ కోడ్... స్కాన్ చేస్తే ఆరోగ్య వివరాలు!
ముఖ్యంగా... ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అని పిలువబడే ఒక రకమైన రొమ్ము క్యాన్సర్ రోగనిర్ధారణ సవాళ్లను కలిగిస్తుంది.
రొమ్ము, వృషణ క్యాన్సర్లపై అవగాహన పెంచేలా యూకే కు చెందిన సూపర్ మార్కెట్ చైన్ మోరిసన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యూకే నేషనల్ హెల్త్ సర్విసెస్ తో కలిసి క్యాన్సర్ లక్షణాలపై అవగాహన పెంచేలా బ్రాలు, బాక్సర్ లేబుల్లపై వార్నింగ్ మెసేజ్ లు ప్రింట్ చేస్తోంది.
ఇందులో భాగంగా లేబుల్స్ పై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే... క్యాన్సర్ కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను ముందే గుర్తించవచ్చని భావిస్తోంది!
దీంతో ఎన్.హెచ్.ఎస్. జాతీయ సూపర్ మార్కెట్ బ్రాండ్ తో కలిసి దుస్తులపై ఆరోగ్య సందేశాన్ని అందించడం ఇదే మొదటిసారి అని ఎన్.హెచ్.ఎస్. ఇంగ్లండ్ క్యాన్సర్ జాతీయ డైరెక్టర్ డేమ్ కాలీ పామర్ చెబుతున్నారు.
ఇందులో భాగంగా మోరిసన్స్ బ్రాండ్ ద్వారా ప్రారంభించబడిన లోదుస్తులు దేశవ్యాప్తంగా 240 స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. ఇది మొదట్లో పురుషుల బాక్సర్ షార్ట్స్ తో పాటు క్రాప్ టాప్, బ్రాలతో త్వరలో పరిచయం చేయబడుతుందని చెబుతున్నారు.
కాగా... రొమ్ము క్యాన్సర్ కు ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ... వయస్సు పెరగడం, వంశపారపర్యంగా కుటుంబ నేపథ్యంలో ఎవరికైనా ఉండటం తో పాటు రొమ్ము కణాల అసాధారణ అభివృద్ధి వంటి ముఖ్యమైన కారకాలు కొన్ని ఊహించిన కారణాలుగా పరిగణించబడతాయని అంటుంటారు.
ముఖ్యంగా... ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అని పిలువబడే ఒక రకమైన రొమ్ము క్యాన్సర్ రోగనిర్ధారణ సవాళ్లను కలిగిస్తుంది. దురద, నొప్పి, వాపు, చనుమొన విలోమం, చర్మం మసకబారడం, రొమ్ము చర్మం ఎర్రబడటం మొదలైనవి దీనికి గల లక్షణాలుగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఈ రకమైన రొమ్ము క్యాన్సర్ లో, గడ్డలు సాధారణంగా కనిపించవు!
రొమ్ము క్యాన్సర్ కొన్ని సందర్భాల్లో మెటాస్టాటిక్ వ్యాధి రూపంలో ఉండవచ్చని చెబుతారు. ఊహించని రీతిలో బరువు తగ్గడం అప్పుడప్పుడు మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ ను సూచిస్తుందని చెబుతున్నారు. ఎముకలు లేదా కీళ్ల నొప్పులు, కామెర్లు లేదా నాడీ సంబంధిత లక్షణాలు కొన్నిసార్లు మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ ను సూచిస్తాయి.
అయితే రొమ్ములలోని అన్ని గడ్డలూ క్యాన్సర్ కావని వైద్యులు చెబుతున్నారు. వీటిలో సుమారు 20% కంటే తక్కువ రొమ్ము గడ్డలు క్యాన్సర్ గా మారుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో రొమ్ములో ఏదైనా ఆకస్మిక మార్పులు లేదా కొత్త లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు!