పాలిటిక్స్‌లో చెప్పడమే కాదు ఒప్పించడమూ తెలియాలి పవనూ...!
ఉమ్మడి తూర్పు, ఉమ్మడి కృష్నా జిల్లాల్లోని అనేక మంది నాయకులు గత రెండు రోజుల్లో రాజీనామాలు చేశారు.
తాంబూలాలిచ్చేశాను.. అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆయనపైనే ఆశలు పెట్టుకుని.. పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుని.. కలలు కన్న అనేక మంది నాయకులు.. కార్యకర్తలు, అభిమానులు హర్టయిన విషయం తెలిసిందే. దీనిని పవన్ కూడా ఒప్పుకొన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సభలో ఈ విషయాన్ని కూడా చెప్పారు.
మరిఇలా.. ఆయనపై అనేక ఆశలు పెట్టుకున్న అభిమానులు, నాయకులు, పార్టీ ముఖ్య నేతలను అనున యించాల్సిన పవన్.. కేవలం .. వారికి కొన్ని సూచనలు..సలహలు ఇచ్చేసి తన పని అయిపోయినట్టుగా చేతులు దులుపుకొన్నారనే టాక్ వినిపిస్తోంది. ఫలితంగా పార్టీలో నాయకులు రాజీనామాల బాట పట్టారు. ఉమ్మడి తూర్పు, ఉమ్మడి కృష్నా జిల్లాల్లోని అనేక మంది నాయకులు గత రెండు రోజుల్లో రాజీనామాలు చేశారు. వీరంతా .. జనసేన సొంతగానే పోటీ చేస్తుంది.. పవన్ సీఎం అవుతారని భావించిన వారే.
అయితే.. టీడీపీతొ జనసేన పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుందో తెలియదు. అంతేకాదు.. పవన్ సీఎం ఆశలు కూడా నెరవేర బోవని స్పష్టమవుతోంది. ఈ విషయా న్ని నాయకులకు చెప్పడంలోనూ.. వారి మనసులు శాంత పరచడంలోనూ పవన్ విఫలమవుతున్నారనేది ప్రధాన చర్చ. వాస్తవానికి ఈ విషయాన్ని పవన్ ప్రస్తావిస్తున్నారు. ఎక్కడ సభ పెట్టినా.. సమావేశం నిర్వహించినా.. ఆయన పదవులపై ఆశలు వద్దని చెబుతున్నారు.
ఇక, పార్టీకి మరో పాతికేళ్ల ప్రస్థానం కూడా ఉందని చెబుతున్నారు. కానీ, ఇతమిత్థంగా ఎవరైతే.. ఆయనపైనా.. పార్టీపైనా ఆశలు పెట్టుకున్నారో.. వారిని ఒక దగ్గరకు చేర్చడం, వారిని మెప్పించేలా తన కార్యాచరణను వివరించడం.. రేపు ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే.. తమకు ఒనగూరే ప్రయోజనంపై వివరణ ఇవ్వడం వంటివి చేయడం ద్వారానే ఇప్పుడున్న సమస్య తీరుతుందనేది పార్టీలో జరుగుతున్న చర్చ. కానీ, ఈ విషయంపై పవన్ ఎక్కడా దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీని వీడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.