ఆ విషయంలో జగన్ ' సిద్ధం ' సూపర్ సక్సెస్..!
ఇక్కడ ప్రజలకు కనీసం ఏమీ మిగల్చకుండానే వైసీపీ ముఠా చుట్టేసింది.
''వైసీపీని ఉత్తరాంధ్ర ప్రజలు ఛీ కొడుతున్నారు. విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోవడం లేదు. విశా ఖలో మొత్తం గోకేశారు. ఇక్కడ ప్రజలకు కనీసం ఏమీ మిగల్చకుండానే వైసీపీ ముఠా చుట్టేసింది. ఇక్కడ వైసీపీ నేతలకు గోరీ కడతానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కనీసం.. ఓటు కాదుకదా.. డమ్మీ ఓటు కూడా వైసీపీ నేతలకు పడదు. ఉత్తరాంధ్ర మొత్తం.. వైసీపీ తుడిచి పెట్టుకుపోతుంది. ఇది ఖాయం.'' ఇదీ.. కొన్నాళ్లుగా వినిపించిన మాట.
అంతేకాదు.. విపక్షాలు పెద్ద ఎత్తున చేసిన ప్రధాన విమర్శలు కూడా ఇవే. అయితే.. ఆయా విమర్శలపై సీఎం జగన్ ఎప్పుడూ స్పందించలేదు. వైసీపీ అధినేతగా కూడా ఆయన మారు మాట్లాడలేదు. ఎందుకంటే.. తాను ఒకటి మాట్లాడితే.. ప్రతిపక్షాలు రెండు మాట్లాడతాయి. దీంతో లేనిపోని రచ్చ తప్ప.. ఇక్కడ ఒరిగేది ఏమీ ఉండదు. అందుకే జగన్ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. ఈ విషయంపై స్పందించలేదు. గతంలో ఉత్తరాంధ్రలో పర్యటించినా.. జగన్ మౌనంగానే ఉన్నారు.
ఇక, ఇప్పుడు ఎన్నికల శంఖం పూరిస్తూ.. ప్రతిపక్షాలు ఎక్కడైతే వైసీపీని తరిమి కొడతారని చెబుతున్నా యో.. అక్కడే అదే ఉత్తరాంధ్రలోని విశాఖలో వైసీపీ అధినేత జగన్ `సిద్ధం` సభను ఏర్పాటు చేశారు. అంతేకాదు.. రాష్ట్రం మొత్తంలోనే కీలకమైన ఉత్తరాంధ్రలో తొలి సభను నిర్వహించడం మరో విశేషం. తద్వారా.. 34 నియోజకవర్గాలపైనా వైసీపీ భారీ వ్యూహమే పెట్టుకుందని తెలుస్తోంది. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో తొలి సభ ను నిర్వహించడం ద్వారా.. ఈ ప్రాంతానికి తామిస్తున్న ప్రాధాన్యం.. చెప్పకనే చెప్పినట్టు అయింది.
ఇక, ప్రతిపక్షాలు చేస్తున్న రాజధాని, అభివృద్ధి, విశాఖ దోపిడీ.. వంటి ఆరోపణలు కూడా ఉత్తుత్తివేనని.,. ప్రజా బలం తమకే ఉందని చెప్పడంలోనూ సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయిందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక, ప్రాంతాల వారీగా చూసుకున్నా.. వైసీపీకి ఉత్తరాంధ్ర తొలి మెట్టుగా మారనుందని అందుకే.. ఇక్కడ సభకు ప్రాధాన్యం ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా సిద్ధం సభ అనేక సమస్యలు.. వివాదాలు, విమర్శలకు చెక్ పెట్టినట్టేనని అంటున్నారు వైసీపీనాయకులు.