లోక్‌ సభలో ఆగంతుకులతో కలకలం... అసలేం జరిగిందంటే...

ఈ సమయంలో... పాక్ కు మద్దతుగా నిలిచిన ఉగ్రసంస్థలైన లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ సంయుక్తంగా ఇండియన్ పార్లమెంట్ పై దాడి చేశాయని నాటి హోమంత్రి ఎల్కే అద్వానీ తెలిపారు.

Update: 2023-12-13 09:08 GMT

2001 డిసెంబర్ 13వ తేదీన భారతదేశంలో సమావేశాలు జరుగుతుండగా పార్లమెంట్‌ పై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన భారతదేశ చరిత్రలో ఒక చేదు జ్ఞాపకమనే చెప్పాలి. ఈ సమయంలో... పాక్ కు మద్దతుగా నిలిచిన ఉగ్రసంస్థలైన లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ సంయుక్తంగా ఇండియన్ పార్లమెంట్ పై దాడి చేశాయని నాటి హోమంత్రి ఎల్కే అద్వానీ తెలిపారు. ఈ సమయంలో నేడు (సరిగ్గా అదేరోజు) పార్లమెంట్ ఆవరణలో కలకలం రేగింది.


అవును... పార్లమెంట్‌ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌ సభ లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఇందులో భాగంగా.. బుధవారం లోక్‌ సభలో ఇద్దరు ఆగంతుకులు గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పబ్లిక్‌ గ్యాలరీ నుంచి లోక్‌ సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి అక్కడున్నవారందరినీ భయభ్రాంతులకు గురిచేశారు.


ఈ సమయంలో ఆ ఇద్దరు అగంతుకలలో లోక్‌ సభలోకి దూకిన వ్యక్తి.. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి "నల్ల చట్టాలను బంద్‌ చేయాలి" అని గట్టిగా నినాదాలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం పార్లమెంట్ భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో స్పీకర్‌ వెంటనే సభను వాయిదా వేశారు.

ఇదే క్రమంలో పార్లమెంట్‌ భవనం బయట ఇద్దరు వ్యక్తులు కూడా ఆందోళనకు యత్నించారు. ఈ సమయంలో పసుపు, ఎరుపు రంగుల పొగను వదిలిన అగంతకులు ఆందోళన కలిగించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులనూ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో... ఈ ఘటనతో కొత్త పార్లమెంట్‌ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

కాగా... సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు (డిసెంబర్ 13)న పార్లమెంట్‌ పై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. 2001 డిసెంబరు 13న ఉదయం 11:30 గంటలకు ఎర్రబుగ్గ ఉన్న ఓ తెల్లరంగు అంబాసిడర్ కారు పార్లమెంట్ ఆవరణలోకి దూసుకొచ్చింది. అందులోని వ్యక్తులు ఫేక్ ఐడీ కార్డులు ధరించి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ప్రవేశించారు.

వీరిలో లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారని హోంశాఖ వెల్లడించింది. ఈ దాడిలో 9 మంది మరణించారు. మరణించిన వారిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒకరు తోటమాలి. ఈ సమయంలో తక్షణమే రియాక్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత అదేరోజు ఇలాంటి సంఘటన జరగడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News