ఈసారి ట్రంప్ హత్యకు ఇలా ప్లాన్ చేశారు!
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై ఇటీవల అమెరికాలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై ఇటీవల అమెరికాలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్యాయత్నంలో ట్రంప్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పెన్సిల్వేనియాలో ఉండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది.
కాగా డోనాల్డ్ ట్రంప్ ను చంపడానికి తాజాగా మరో కుట్ర జరిగినట్టు తేలింది. ఆయన ఒక్కడే కాకుండా మరికొంతమంది నేతలను హత్య చేసేందుకు ఒక పాకిస్థానీ కుట్ర పన్నాడు. దీన్ని అమెరికా దర్యాప్తు సంస్థ.. ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. కుట్రదారుడిని పోలీసులు అరెస్టు చేశారు, ఇతడికి అమెరికా శత్రు దేశం ఇరాన్ తో కూడా సన్నిహిత సంబంధాలున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే సంచలన విషయాలను తెలిపారు.
ఈ కుట్ర ఇరాన్ దేనని క్రిస్టఫర్ వ్రే తెలిపారు. ట్రంప్ తో సహా మరికొందరిని హత్య చేయడానికి పాకిస్థాన్ కు చెందిన 46 ఏళ్ల ఆసిఫ్ మర్చంట్ అనే కిరాయి హంతకుడికి ఇరాన్ పని అప్పగించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆసిఫ్ మర్చంట్ అమెరికాలోని న్యూయార్కులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్రకు సూత్రధారి ఇరాన్ కాగా పాత్రధారి ఆసిఫ్ మర్చంట్ అని చెప్పారు.
ఇరాన్ కుట్రలో భాగంగా డోనాల్డ్ ట్రంప్ సహా పలువురు రాజకీయ నేతలను చంపడానికి ఆసిఫ్ మర్చంట్ పాకిస్థాన్ నుంచి ఏప్రిల్ లో అమెరికా చేరుకున్నాడు. ఈ క్రమంలో జూలై 12న అమెరికా పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఆసిఫ్ మర్చంట్ అమెరికాకు చేరుకోగానే కిరాయి హంతకుల కోసం ఒక వ్యక్తిని సంప్రదించాడు. అయితే ఆ వ్యక్తి అండర్ కవర్ ఆఫీసర్. అతడే ఆసిఫ్ మర్చంట్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా నిందితుడు ఆసిఫ్ మర్చంట్ కొంతకాలం ఇరాన్ లో ఉన్నాడని తెలుస్తోంది అతడి కుటుంబం ప్రస్తుతం అక్కడే ఉందని చెబుతున్నారు.
కాగా పోలీసుల విచారణలో పాకిస్థాన్, తదితర ఇస్లాం దేశాలకు హాని చేసే అమెరికాకు చెందిన వ్యక్తులను అంతం చేయడం తమ లక్ష్యమని ఆసిఫ్ మర్చంట్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు తమ హిట్ లిస్టులో డోనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నాడని చెప్పడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అలాగే మరికొందరి నేతల పేర్లు కూడా చెప్పాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల పెన్సిల్వేనియాలో డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నానికి ఇరాన్ కుట్రే కారణమా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.