జనసేనలో చేరేందుకు బొత్స సోదరుడు రెడీ?

ఇప్పటిదాక బొత్స ఎక్కడ ఉంటే టోటల్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటూ వచ్చింది.

Update: 2024-09-25 14:30 GMT

ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసిస్తున్న మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కుటుంబంలో తొలిసారి రాజకీయ చీలిక వచ్చింది. ఇప్పటిదాక బొత్స ఎక్కడ ఉంటే టోటల్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటూ వచ్చింది.

కానీ ఇపుడు ఆయన సోదరుడే అన్నను కాదని వైసీపీని వీడిపోతున్నారు. ఆయన జనసేన వైపు చూస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన ఎవరో కాదు నెల్లిమర్ల సీటుని ఆశిస్తున్న బొత్స లక్ష్మణరావు. నెల్లిమర్లకు వైసీపీకి ఇంచార్జి గా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు. ఆయనకు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు తో వియ్యం కూడా ఉంది.

ఇక చూస్తే కనుక 2024 ఎన్నికలలో తనకే టికెట్ ఇవ్వమని బొత్స లక్ష్మణరావు పట్టు పట్టారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బడ్డుకొండ అప్పలనాయుడుకే వైసీపీ అధినాయకత్వం ఓటు వేసింది. అంతే కాదు బొత్స కూడా లక్ష్మణరావుకు టికెట్ ఇప్పించలేకపోయారు. అంతటా తన వారే ఉండడంతో లక్షణరావుకు ఆయన టికెట్ ని తేలేకపోయారు అని చర్చ సాగింది.

అయితే ఆ అసంతృప్తి ఒక వైపు ఉంది మరో వైపు ఆనాటి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి నెల్లిమర్లలో కొంత అలజడి రేపిన లక్ష్మణరావు బడ్డుకొండ గెలుపునకు కృషి చేయలేదని కూడా ఆయన వ్యతిరేక వర్గం చెబుతూ ఉంటుంది.

ఇక బొత్స లక్ష్మణరావు వైసీపీ ఓడాక కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇపుడు ఆయన జనసేన వైపు అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిని కలుసుకోవడం రాజకీయంగా చర్చకు తావిస్తోంది.

ఎటూ నెల్లిమర్లలో కూటమి గెలుపు కోసం ఆయన కృషి చేశారు కాబట్టి ఆయన మీద జనసేనకు సదభిప్రాయం ఉంది అని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లోకం మాధవి ద్వారా ఆయన జనసేనలో చేరడం వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల టికెట్ ని బొత్స లక్ష్మణరావు సాధించేందుకే ఇదంతా అని అంటున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని తన కోరికను ఈ విధంగా తీర్చుకునేందుకు కొత్త రాజకీయ దారిని ఆయన వెతుక్కుంటున్నారు అని అంటున్నారు. మరి దీని మీద బొత్స వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కానీ బొత్స ఫ్యామిలీ నుంచి తొలి వికెట్ అలా పడింది అని అంటున్నారు. తొందరలోనే పవన్ ని కలసి జనసేన కండువాను లక్ష్మణరావు కప్పుకుంటారు అని అంటున్నారు.

Tags:    

Similar News