లోకేష్ డిప్యూటీ సీఎం..మాట్లాడొద్దంతే !

అంతే ఆ రచ్చ అలా మొదలై ఈ రోజుకీ ఆగడంలేదు. నెల్లూరు జిల్లాల్కు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందుకున్నారు.

Update: 2025-01-20 11:58 GMT

గత మూడు రోజులుగా మీడియాలో ఎటు చూసినా ఒకటే గోల. ఒక్కటే చర్చ. ఒక్కటే మాట. ఇదంతా దేని గురించి అంటే నారా లోకేష్ ని అర్జెంటుగా డిప్యూటీ సీఎం చేయాలని. అన్న గారి వర్ధంతి వేళ కడపకు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చేయాలని అ విధంగా మూడవ తరాన్ని నాయకత్వ స్థానంలో ముందు పెట్టాలని కోరారు.

అంతే ఆ రచ్చ అలా మొదలై ఈ రోజుకీ ఆగడంలేదు. నెల్లూరు జిల్లాల్కు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందుకున్నారు. నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ రాగం కలిపారు. ఇక పిఠాపురం వర్మ జత చేరారు. ఆయన కూడా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి అన్నారు. ఇదంతా కార్యకర్తల మనోభావాలకు ప్రతీక అని మరో అడుగు ముందుకేశారు.

రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అయితే నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి ఏకంగా సీఎం కావాలని కూడా మాట్లాడారు. హోం మంత్రి అనిత అయితే నారా లోకేష్ నుదిటిన ఏమి రాసి ఉంటుందో అదే జరుగుతుందని దానిని ఎవరూ ఆపలేరంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతా దైవేచ్చ అని కూడా వేదాంతం వల్లించారు.

ఇలా ఒక వైపు అంతా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ ప్రచారం హోరెత్తిస్తున్న వేళ జనసేన నుంచి ధీటుగా బదులు వస్తోంది. వారు సైతం మా నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ కొత్త డిమాండ్ ముందుకు తెస్తున్నారు. ఇలా కూటమిలో సడెన్ గా ఈ రకమైన డిమాండ్లతో రాజకీయ రచ్చ పీక్స్ చేరుతున్న నేపధ్యంలో తెలుగుదేశం అధినాయకత్వం అలెర్ట్ అయింది.

ఆపండి అంటూ తమ్ముళ్లకు పార్టీ సీనీయర్లకు సూచించింది. నారా లోకేష్ సీఎం అన్న ప్రచారానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా కోరింది. లోకేష్ డిప్యూటీ సీఎం అంటే అదంతా సాఫీగా జరిగేలా కనిపించడం లేదు, పైపెచ్చు సీన్ లోకి జనసేన వచ్చేసింది. ఆ పార్టీ నేతలు సరికొత్త డిమాండ్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో తమ్ముళ్ళకు జన సైనికులకు మధ్య డైలాగ్ వార్ స్టార్ట్ అయిపోయింది. ఈ నేపధ్యాన్ని అంతా చూసిన హై కమాండ్ ఆ మాట ఎత్తొద్దు అంటూ కఠినమైన ఆదేశాలనే జారీ చేసింది.

దీనిని అతి ఉత్సాహంగా కూడా పేర్కొంది. దానిని వదులుకోవాలని నేతలకు సున్నితంగానే సూచించింది. ఎవరికి తోచిన తీరులో వారు వ్యక్తిగత అభిప్రాయాలు మాట్లాడవద్దు అంటూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం టీడీపీ అధికార ప్రతినిధులకు స్వయంగా ఫోన్లు చేసి మరీ నోటికి తాళాలు వేయాలని కూడా కోరిందని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే ఇది ఎటు నుంచో మొదలై ఎటో పోతోందని అధినాయకత్వం గ్రహించింది అంటున్నారు. ఆ మీదటనే ఆగ్రహించింది అని కూడా చెబుతున్నారు సున్నితమైన అంశాలు ఈ విధంగా రాజకీయ ప్రకటనలు మారి కూటమిలోని ప్రధాన పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కి దారి తీయడం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదని భావించే ఆదిలోనే తుంచేసింది అని అంటున్నారు.

ఇక మీదట ఎవరైనా ఈ అంశం మీద మాట్లాడితే మాత్రం వారు కచ్చితంగా పార్టీ గీత దాటిన వారే అవుతారని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ హైకమాండ్ అయితే ఈ ప్రకటనల విషయంలో ఎలాంటి పొంగిపోవడం అన్నది జరగలేదు అంటున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు ఆయనకు ఎపుడేమి చేయాలో బాగా తెలుసు అని అంటున్నారు.

అందుకే ఈ ఇష్యూని ఇంతటిలో క్లోజ్ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి లోకేష్ కి డిప్యూటీ సీఎం అన్నది మెల్లగా పొగగా మారి నిప్పుగా పరివర్తన చెందకముందే దానిని ఆర్పేశారు అని అంటున్నారు. మరి దీని పర్యవసానాలు శాంతంగా ప్రశాంతంగా ఉండనీయిస్తాయా అన్నదే చర్చగా ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.

Tags:    

Similar News