లాస్ ఏంజెలెస్ కు ఇది మామూలు లాస్ కాదు.. షాకింగ్ గా తేరుకునే సమయం!
ఈ సమయంలో... ఈ భారీ నష్టం నుంచి లాస్ ఏంజెలెస్ తేరుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది ఆసక్తిగా మారింది.
లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. సుమారు రెండు వారాలుగా కార్చిచ్చు లాస్ ఏంజెలెస్ ను దహనం చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో లక్షల కోట్ల నష్టం వాటిళ్లినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో... ఈ భారీ నష్టం నుంచి లాస్ ఏంజెలెస్ తేరుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది ఆసక్తిగా మారింది.
అవును... లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు మంటలు ఇంకా చల్లారలేదు. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తుంది. ఈ మంటల వల్ల కనీసం 27 మంది మృతి చెందగా.. 12,000 కంటే ఎక్కువ నిర్మాణాలు ధ్వంసమయ్యాయని అంటున్నారు. ఈ కార్చిచ్చు ఇప్పటికీ మండుతూనే ఉండటం తీవ్ర ఆద్మోళన కలిగిస్తుంది.
అయితే.. ప్రస్తుతం గాలులు కాస్త బలహీనపడ్డాయని.. ఇది శుభ సూచికమని.. అగ్నిమాపక సిబ్బందికి ప్రస్తుత పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత కూడా ప్రమాదకర పరిస్థితులు ఉంటాయని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.
మరోపక్క లాస్ ఏంజెలెస్ కౌంటీలో పాలిసాడ్స్, ఈటన్ ఫైర్ జోన్ లలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూలు ఇప్పటీకీ అమలులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో నగరం తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవడానికి.. ఆ కాలిపోయిన నిర్మాణాలన్నీ తిరిగి నివాసాలుగా మారడానికి ఎంత కాలం పడుతుందనేది ఆసక్తిగా మారింది.
ఈ సమయంలో... అధికారులు నగరాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఈ వినాశకర కార్చిచ్చు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఒక దశాబ్ధ కాలం పట్టొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో... మొన్నటివరకూ చూసిన లాస్ ఏంజెలెస్ నగరం తిరిగి ఆ స్థాయిలో తేరుకోవడానికి 10 ఏళ్లు పడుతుందన్నమాట.