బీఆరెస్స్ భ్రమల్లో ఉందా..
ఈ సమయంలో పలువురు బీఆరెస్స్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి. సుమారు 10ఏళ్ల పాటు టీఆరెస్స్ (బీఆరెస్స్) ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు మూడోసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇందులో భాగంగా 64 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం అప్పగించారు. ఈ సమయంలో బీఆరెస్స్ 39 సీట్లకే పరిమితం అయింది. ఈ సమయంలో పలువురు బీఆరెస్స్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
అవును... తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ కు మేన్డేంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారాలు చేశారు. ఇప్పుడిప్పుడే మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సమయంలో బీఆరెస్స్ నేతలు మాత్రం... కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పలువురు నేతలు చేస్తున్న కామెంట్లే!
తాజాగా జనగామ బీఆరెస్స్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి పడిపోతుందని వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయామని అధైర్యపడొద్దని పార్టీ కార్యకర్తలను కోరుతున్న సందర్భంగా స్పందించిన ఆయన... ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ వచ్చేది బీఆరెస్స్ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
పైగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీలోని నేతలే పడగొట్టుకుంటారని.. త్వరలో తిరిగి బీఆరెస్స్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. కార్యకర్తలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ధైర్యంగా ఉండాలన్నట్లుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలకు ధైర్యం చెప్పుకోవాలంటే ఇది కాదేమో పద్దతి అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అలా చెప్పకపోతే వారిలో కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తారనే ఆందోళన ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
కాగా... ఇటీవలే స్టేషన్ ఘనపూర్ లో బీఅరెస్స్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కూడా ఈతరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. మరో ఆరు నెలలు లేదా ఏడాదిలో కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి ఆధిక్యంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కడియం చేసిన వాక్యాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
దీంతో... ప్రజలు మేన్ డేట్ ఇచ్చిన తర్వాత బీఆరెస్స్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆత్మవంచనగా పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడుతుండగా.. కార్యకర్తలను వంచించొద్దంటూ మరికొందరు సూచిస్తున్నారు.