ధరణిలో డేటా సేఫేనా ?
అంటే టెర్రాసిస్ లోని భూముల డేటా మొత్తం కూడా కొత్త కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీయార్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న ధరణి పోర్టల్ భద్రతపై అనుమానలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రివ్యూల్లో ఉన్నతాధికారులు చెబుతున్న వివరాలను, బయటపడుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత ప్రభుత్వంలో పోర్టల్ భద్రతపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిక్షిప్తంచేసిన భూముల వివరాల డేటాను ప్రభుత్వ రంగ సంస్ధయిన నేషనల్ ఇన్ఫర్ మేటిక్ సెంటర్(ఎన్ఐసీ)ని కాదని ప్రైవేటు సంస్ధ టెర్రాసిస్ టెక్నాలజీస్ కు కట్టబెట్టారు కేసీయార్.
అయితే టెర్రాసిస్ సంస్ధను అమెరికాలోని మరో సంస్ధ కొనేసిందట. అంటే టెర్రాసిస్ లోని భూముల డేటా మొత్తం కూడా కొత్త కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో భూ వివరాలన్నీ డేంజర్లో ఉన్నట్లే అని ప్రభుత్వవర్గాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. అసలే ధరణి పోర్టల్ నిర్వహణపై వేలాది ఆరోపణలు వినబడుతున్నాయి. ఇపుడున్న ఆరోపణలకు తోడు కొత్తగా డేటా భద్రతపైన కూడా అనుమానాలు పెరుగుతుండటం ఆందోళనగానే ఉంది.
భూ రికార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమం దేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నదే. అయితే ఇంకెక్కడా లేనివిధంగా కేసీయార్ ప్రభుత్వం ఈ బాధ్యతను ప్రైవేటుసంస్ధకు కట్టబెట్టింది. ఈ మధ్యనే ధరణి పోర్టల్ పై రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో అనేక ప్రశ్నలు వచ్చాయి. పోర్టల్ లోని సమాచారానికి బ్యాకప్ ఉందా ? సర్వర్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా ? సర్వర్ ఏ కారణంగా అయినా దెబ్బతింటే అందులోని సమాచారం మొత్తం బయటకు తీసుకోవటం ఎలాగంటు అనేక ప్రశ్నలు తలెత్తాయి.
అయితే రేవంత్, మంత్రులు అడిగిన చాలా ప్రశ్నలకు తమ దగ్గర సమాధానాలు లేవని ఉన్నతాధికారులు చెప్పారట. ఎందుకంటే కేసీయార్ వ్యక్తిగతంగా ధరణి పోర్టల్ వ్యవహారాలను పర్యవేక్షించేవారని, మొత్తం పెత్తనమంతా ప్రైవేటు సంస్ధదే అని ఉన్నతాధికారులు చెప్పారట. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిజికల్ కాపీలు లేవని, లావాదేవీలు, ఎన్ఓసీ, క్లాసిఫికేష్ చేంజ్ లాంటి వ్యవహారాలన్నీ డైరెక్టుగా పోర్టల్లోనే జరుగిన కారణంగా ఎవరి దగ్గరా ఫిజికల్ కాపీలు అందుబాటులో లేవని అధికారులు చెప్పారట. పోర్టల్ నిర్వహణ నిమ్మితం ప్రభుత్వం సదరు ప్రైవేటు కంపెనీకి ఏటా రు. 5 కోట్లు చెల్లించిందట. కంపెనీ వ్యవహారాలు ఎలాగున్నా ఇపుడు అందులోని డేటా భద్రతపైనే చాలా అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి వీటికి సమాధానం ఎప్పుడు దొరకుతుందో.