కో అంటే కోటిన్నర : వైసీపీ ఓటు బ్యాంక్ అదేనా...?

ఏపీలో మొత్తం చూస్తే కోటీ అరవై లక్షల కుటుంబాలు ఉంటే అందులో కోటీ నలభై అయిదు నుంచి కోటిన్నర దాకా ప్రభుత్వ పధకాలను అందిస్తున్నామని వైసీపీ పెద్దలు చెబుతున్నారు.

Update: 2023-11-17 02:45 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎపుడూ సభలలో మాట్లాడుతూ ఒకే ఒక్క మాట అంటూ ఉంటారు. తనకు ఎవరూ సాయం లేరు. ఎవరితోనూ పొత్తులు లేవు. జనంతోనే తన పొత్తు అని అంటూంటారు. అదే టైం లో ఆయన మరో మాట కూడా అంటారు. ప్రజలకు నేను చేసిన మేలు చూసి ఓటేయండి అని. ఏపీలో మొత్తం చూస్తే కోటీ అరవై లక్షల కుటుంబాలు ఉంటే అందులో కోటీ నలభై అయిదు నుంచి కోటిన్నర దాకా ప్రభుత్వ పధకాలను అందిస్తున్నామని వైసీపీ పెద్దలు చెబుతున్నారు.

ఇలా ప్రతీ కుటుంబంలో కనీసం ఇద్దరు వంతున లెక్క తీసుకున్నా మూడు కోట్ల మంది ఓటర్లు తమ వైపు ఉన్నారని ఆ పార్టీ ధీమాగా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం ఏపీలో కొత్త ఓటర్లతో కలుపుకుని మొత్తం ఓటర్ల సంఖ్యను నాలుగు కోట్ల పై చిలుకుగా తేల్చింది. అంటే వైసీపీ ఈ మొత్తం ఓటర్లలో మూడు వంతులు తన వైపు తీసేసుకునేలా పధకాలను అందిస్తోంది అన్న మాట.

నూటికి ఎనభై శాతం మంది మా వైపే అని వైసీపీ చెప్పడం వెనక కూడా ఇదే అర్ధం ఉంది అని అంటున్నారు. నాలుగు కోట్లలో మూడు కోట్లు అంటే ముప్పావు వంతు ఓటర్లు వైసీపీ ఖాతాలోనే ఉంటే కేవలం కోటి మంది మాత్రమే ఓటర్ల మీదనే విపక్షం ఫుల్ ఫోకస్ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు.

అందుకే వైసీపీ నేతలు మరో మాట కూడా చెబుతున్నారు.మీరు చీల్చాల్సింది నెగిటివ్ ఓట్లు కాదు పాజిటివ్ ఓట్లు అని. అంటే వివిధ కారణాల వల్ల పధకాలు అందని వారు అర్హత లేని వారు కోటి మంది ఉంటే వారే విపక్షం వైపుగా ఆకర్షితులు అవుతారని వైసీపీ భావిస్తోంది. ఈ కోటి జనాభాలో కూడా ఎక్కువ మంది అర్బన్ ఓటర్లుగా కూడా భావిస్తోంది.

అదే విధంగా మేధావులు ఉన్నత వర్గాలు ఉద్యోగులు ఇలా కేటగిరీలు తీస్తే వీరే ప్రభుత్వం పట్ల కాస్తా వ్యతిరేకంగా ఉండవచ్చు అని కూడా అంచనా కడుతోంది. అయితే ఈ కోటి మందిని కూడా దూరం చేసుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదని అంటున్నారు. రానున్న రోజులలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలను కూడా చేరువ చేసుకునేందుకు కొత్త పధకాలను తీసుకుని వస్తామని చెబుతున్నారు.

అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పూర్వ పక్షం చేసిన వైసీపీ ఇపుడు అందులో కూడా పాజిటివ్ ఓట్లను వెతుక్కునే పనిలో పడింది అంటున్నారు. అదే విధంగా ఆ ఓటర్ల నుంచి కూడా ప్రభుత్వానికి జై కొట్టించుకునేందుకు ఆకట్టుకునేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది.

ఇప్పటికే అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వస్తున్న వైసీపీ మరిన్ని హామీలను కూడా ఇవ్వాలని అనుకుంటోంది. ప్రతిపక్షానికి ఏ ఒక్క అవకాశం కూడా లేకుండా చేయాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో విపక్షం కూడా తమ ఎన్నికల ప్రణాళికను వైసీపీ కంటే మెరుగ్గా తీసుకుని రావాల్సి ఉంది అని అంటున్నారు.

అయితే తాజాగా జరిగిన టీడీపీ జనసేన కో ఆర్డినేషన్ మీటింగులో తీసుకున్న నిర్ణయాలు మినీ మ్యానిఫెస్టోగా ప్రచారంలో ఉన్న పదకొండు హామీలు వైసీపీ పధకాలను ఢీ కొట్టడానికి ఏ మాత్రం సరిపోవు అని అంటున్నారు. దీని మీద జనసేన సానుభూతిపరుడు మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య అయితే వైసీపీని నిలువరించడానికి ఈ హామీలు ఏ మాత్రం సరిపోవు అని బహిరంగంగానే చెప్పేశారు.

ఆయన టీడీపీ జనసేన కూటమి కోసం ఆకర్షణీయమైన హామీలను రూపకల్పన చేశారు. వాటిని ఆయన జనసేన నాయకులకు అందించినట్లుగా ప్రచారం సాగింది. వాటిని ప్రకటిస్తేనే ఓటర్లు విపక్షం వైపుగా టర్న్ అవుతారు అని ఆయన అంటున్నారు.

ఇక తటస్థంగా ఉన్న వారు రాజకీయ విశ్లెషకులు కూడా హామీలు ఇవ్వడం నోటి మాట అని వాటిని అమలు చేసే సత్తా ఎవరికి ఉంది చిత్తశుద్ధి ఎంత అన్నది కూడా ఓటరు చూస్తారని ఆ విధంగా ఆలోచిన మీదటనే తాము కోరుకునే పార్టీకి ఓటేస్తారు అని అంటున్నారు. అంటే క్రెడిబిలిటీ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. అది తమకు ఉందని గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో రుజువు అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సో తమ ధీమా అదే అని వారు నిబ్బరంగా జబ్బలు చరుస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News