మా నంబర్ 56 ..కడియం కామెంట్స్ దేనికి సంకేతం...
ఇపుడు ఏకంగా బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ పార్టీకి 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బిగ్ సౌండ్ చేస్తున్నారు.
ఇంకా కాళ్ళ పారాణి ఆరలేదు అపుడే చేటు మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాదితో కూలిపోతుంది అని జోస్యం చెప్పేశారు. ఇపుడు ఏకంగా బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ పార్టీకి 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఇదంతా దేనికి సంకేతం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్కి బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పలు టీవీ చానళ్ళ డిబేట్లలో జనాలను కోరారు. తమ పార్టీకి 80 దాకా ఎమ్మెల్యేలను ఇస్తే కచ్చితంగా సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే సింపుల్ మెజారిటీ ఇస్తే ఇబ్బందులు తప్పవని రేవంత్ రెడ్డి ముందే ఊహించారు అన్న మాట.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ సీఎం గా ప్రకటించింది. ఆయన ఈ నెల 7న ప్రమాణ సీకారం చేయబోతున్నారు. ఈ మధ్యలోనే అప శకునాలు లాంటి మాటలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కి చెందిన స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కి షాక్ ఇచ్చేలా సౌండ్ చేసారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన అంటూనే మా మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి 7 సీట్లు వచ్చాని గుర్తు చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్న బీజేపీ 8 సీట్లను అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది అసంతృప్తులను కలిపితే తమకు 56 సీట్లు అవుతాయని కడియం బాంబు పేల్చారు. అంటే ఏకంగా కాంగ్రెస్ సర్కార్ కి ఎర్త్ పెట్టేలాగానే కడియం మాటలు ఉన్నాయని అంటున్నారు. అంతటితో ఆయన ఆగలేదు ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా గందరగోళంలో ఉన్నారని ఆ పార్టీ లోపలి పరిస్థితిని కూడా అంచనా కట్టేశారు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని కడియం అంటున్నారు. అయితే తమ నాయకుడు కేసీఆర్ సింహంలా వస్తారన్నారు ఇక మరో ట్విస్ట్ ఏంటి అంటే సరైన సమయం చెప్పలేం కానీ మిత్రులతో కలిసి తమ స్థానాలు 56కు చేరుకుంటాయని చెప్పారు. సింహం రెండడుగులు వెనక్కి వేస్తోందంటే వేటకు సిద్ధమైనట్లే అని కడియం అంటున్నారు. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుందని, ఎవరూ అధైర్యపడవద్దని క్యాడర్ కి ఆయన ధైర్యం చెప్పారు.
ఇవన్నీ పక్కన పెడితే మా నంబర్ 56 అని కడియం అనడం వెనక ఉద్దేశ్యాలు ఏంటి అన్న చర్చ సాగుతోంది. అదే విధంగా బీజేపీని మజ్లీస్ ని కూడా కలుపుకుని కాంగ్రెస్ అసంతృప్తులను కూడా కలుపుకుంటామని ప్రభుత్వం ఏర్పాటు మాకు ఈజీ అన్నట్లుగా కడియం అనడం అంటే ఈ రోజు కాకపోయినా ఏదో నాటికి బీఆర్ఎస్ నుంచి ముప్పు అయితే పొంచి ఉందనే అర్ధం చేసుకోవాలని అంటున్నారు. దీని మీద ప్రభుత్వ సారధిగా రేవంత్ రెడ్డి ఏమి చేస్తారో ఏ రకమైన ఆపరేషన్ స్టార్ట్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి టఫ్ టాస్కులు చాలానే ఉన్నాయని అంటున్నారు.