కేసీఆర్ 65 ఎకరాల విలువ రూ.1.62 కోట్లేనా?

ఎవరి దాకానో ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనకున్న వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాల్ని వెల్లడించిన వైనం చూస్తేనే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటుంది.

Update: 2023-11-10 17:30 GMT

అవును.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక ప్రముఖ రాజకీయ నేత అప్పు ఇచ్చిన వైనం ఆయన సమర్పించిన ఆస్తుల అఫిడవిట్ కారణంగా బయటకు వచ్చింది.మాజీ ఎంపీ వివేక్ నుంచి ఆయన రూ.1.06 కోట్ల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ కు అప్పు ఇచ్చిన వివేక్ వైనం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే ఆస్తుల అఫిడవిట్లు ఫార్సుగా మారాయా? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఎవరి దాకానో ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనకున్న వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాల్ని వెల్లడించిన వైనం చూస్తేనే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన తెలంగాణలో ఎకరం భూమి విలువ ఎంతలా పెరిగిందో పలు సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఎకరం భూమి ఎంతనో ఆయన పలుమార్లు చెప్పుకొచ్చారు.

అలాంటిది ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్ కు ఉన్న 65 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన ధర ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది. అఫిడవిట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం తనకున్న ఆస్తులతో పాటు.. తనకున్న వ్యవసాయ భూమిని ప్రకటించారు. ఇందులో ప్రకటించిన ఆస్తుల్ని పక్కన పెట్టి.. ఒక్క వ్యవసాయభూమిని లెక్క వేసుకున్నా.. ఇంత తక్కువ ధరను ప్రకటిస్తారా? అన్నది సందేహంగా మారింది.

జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో 584 గజాల ఇల్లు.. తీగలగుట్ట పరిధిలో 2141 చదరపు గజాల ఇల్లు.. మర్కుక్ మండలం ఎర్రవల్లిలో 7865 చరదపు గజాల ఇల్లుతోపాటు 65.25 ఎకరాల భూమి మొత్తం విలువ కలిపితే రూ.1.62 కోట్లుగా పేర్కొన్నారు. మిగిలిన స్థిరాస్తుల్ని పక్కన పెట్టి కేవలం వ్యవసాయ భూమి విలువను రూ.1.62 కోట్లుగా తీసుకున్నా సరే.. ఇంత తక్కువకు ఎలా చూపిస్తారన్న సందేహం కలుగక మానదు.

ఎందుకంటే.. 65 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.1.62కోట్లగా లెక్కలోని తీసుకన్నా.. ఎకరం రూ.2.49 లక్షలు మాత్రమే అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే.. ఎకరం భూమి ధర రూ.2.49 లక్షల ధర ఉందా? అన్నది ప్రశ్న. అంతదాకా ఎందుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న 584 చదరపు గజాల స్థలాన్ని చూసినా.. గజం లక్షకు పైనే ఉంది. కాదు 50వేల రూపాయిలే అనుకుందాం. అలా చూసినా రూ.2.92 కోట్లుగా చెప్పాలి. ఈ లెక్కన కేసీఆర్ స్థిరాస్తుల లెక్కల్లోని సిత్రాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో పది ఎకరాలు వస్తుందని చెప్పే సీఎం కేసీఆర్ రూ.2.5 లక్షలకు పది ఎకరాలు ఏపీలో వస్తుందా? ఒక్క సెంటు వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు చెప్పే మాటలకు.. సమర్పించే అఫిడవిట్లకు పొంతన లేకపోవటం ఏమిటన్నది ప్రశ్న. భూముల ధరల్ని మార్కెట్ లెక్కల ప్రకారం చూపించకున్నా..కనీసం ప్రభుత్వ లెక్కల ప్రకారం చూపించారా? అన్నది సందేహంగా మారింది. ఏమైనా.. కోట్లాది రూపాయిల విలువైన ఆస్తుల్ని లక్షల్లో చూపిస్తున్న తీరు చూస్తే.. అఫిడవిట్ల దాఖలు వ్యవహారం మొత్తం ఒక ఫార్సులా కనిపించక మానదు.

మరోవైపు ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ విషయానికి వస్తే.. ఆయన సమర్పించిన ఆస్తుల అఫిడవిట్ లో ఆసక్తికర అంశం కనిపించింది. మంత్రి కేటీఆర్ కంటే కూడా ఆయన సతీమణి శైలిమ ఎక్కువ సంపన్నురాలిగా పేర్కొన్నారు. కేటీఆర్ కు ఒక ఇన్నోవా ఉంది. 2018 ఎన్నికల నాటికి ఆయనకు రూ.3.63 కోట్ల చరాస్తులు ఉండగా.. ప్రస్తుతం రూ.6.92 కోట్లకు పెరిగాయి. కేటీఆర్ సతీమణి శైలిమకు ప్రస్తుతం రూ.26.49 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. కేటీఆర్ పేరుతో రూ.10.41 కోట్లు.. శైలిమ పేరుతో రూ.7.42 కోట్లు.. వారి కుమార్తె అలేఖ్య పేరుతో రూ.46.71 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ కుటుంబానికి రూ.14.93 లక్షల ఉమ్మడి ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. కేటీఆర్ వద్ద 100 గ్రాముల బంగారం.. శైలిమ వద్ద రూ.1.89 కోట్ల విలువైన 4.7 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి.

Tags:    

Similar News