హమాస్ రాయబారాలు... తగ్గేదేలే అంటున్న నెతన్యహు!
నెక్స్ట్ స్టెప్ తీసుకున్న ఇజ్రాయేల్... హమాస్ రాయబేరాలు?
మనకు ఉన్నదే బలం, మనకు తెలిసిందే జ్ఞానం అనుకుని ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి తొలి దెబ్బ కొట్టేసి జబ్బలు చరిచేసి, తొడలు కొట్టేస్తే సరిపోదని.. ప్రత్యర్థి ఏమాత్రం బలమైనవాడైనా తర్వాత దవడలు పేలిపోతాయనే విషయం హమాస్ మిలిటెంట్లకు అర్ధమైఉంటుందనే కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి. దీంతో... మిత్రదేశాలతో రాయబారాలు పంపుతుందని తెలుస్తుంది! అయితే ఇజ్రాయేల్ మాత్రం తగ్గేదే లే అంటుంది!
అవును... ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయేల్ పై హమాస్ రాకెట్లతో మెరుపు దాడిచేసింది.. అనంతరం అమాయక ప్రజలను విచక్షణా రహితంగా కాల్చి చంపింది. సుమారు 200 మందిని యుద్ధ ఖైదీలుగా బందించి తీసుకుపోయింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతోంది. ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసి గజ గజ లాడించేస్తుంది.
ఇజ్రాయేల్ పై హమాస్ చేసిన ఆ పనివల్ల... గాజాలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఇప్పటికే గాజాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లగా... కనీసం తినడానికి తిండి లేని దయనీయ పరిస్థితుల్లో అక్కడి ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్-హమాస్ ఇరుపక్షాలు వెంటనే కాల్పులు విరమించాలని, బందీలుగా ఉన్న పౌరుల్ని విడిచిపెట్టాలని కోరుతూ రాజీ కుదుర్చేందుకు మిడిల్ ఈస్ట్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఇది ఆయా దేశాలు వారికి వారే తీసుకున్న నిర్ణయమా.. లేక, ఇజ్రాయేల్ దాడులు భరించలేక హమాస్ వారితో అలా చెప్పించిందా అనే విషయంపై పూర్తి స్పష్టత లేదు కానీ... ఇలా మిడిల్ ఈస్ట్ దేశాలు చెప్పగానే హమాస్ స్పందించేసింది. యుద్ధం ఆపేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తక్షణమే ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
ఇందులో భాగంగా... ఖైదీలైన ఇజ్రాయెలీ ప్రజలను తాము విడిచిపెడతామని, దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలని, అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమని హమాస్ నేత యాహ్య సిన్వార్ వెల్లడించారు.
హమాస్ రాయ"బేరాలు అలా ఉంటే... ఇజ్రాయేల్ మాత్రం ఈ విషయంపై తప్ప అన్ని విషయాలపైనా స్పందిస్తుంది. యుద్ధం విషయంలో తగ్గేదేలే అని పరోక్షంగా చెబుతుంది. ఇందులో భాగంగా... గాజాపై భూతల దాడులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అదే విధంగా... ఇప్పటికే ట్రైల్ రన్ పూర్తి చేసిందని తెలుసుంది. మరోవైపు ఈ ట్రైల్ రన్ లోనే కొన్ని లక్ష్యాలపై ఇప్పటికే దాడులు చేసి తిరిగి వచ్చింది.
ఈ సమయంలో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు సిద్ధమై గాజాలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇందులో భాగంగా... తాము ఇప్పటికే యుద్ధంలో రెండో దశకు చేరుకున్నామని.. హమాస్ సైన్యాన్ని, నాయకత్వాన్ని అంతమొందించి.. బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ ప్రజల్ని క్షేమంగా తిరిగి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.
అదేవిధంగా... గాజాలో తాము సాగిస్తున్న యుద్ధం సుదీర్ఘంగా సాగే క్లిష్టతరమైన పోరాటం అయినప్పటికీ ఇందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని నెతన్యహు స్పందించారు. అంటే... ఇప్పట్లో యుద్ధం ఆపే ఆలోచన తమకు లేదని, తమకు ఎవరూ ఆఫర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, రాయబేరాలు చెల్లవని, హమాస్ మెడలు వంచి తమ ప్రజలను తాము విడిపించుకుని వెళ్తామని ఇజ్రాయేల్ పరోక్షంగా, గట్టిగా చెప్పిందని అంటున్నారు పరిశీలకులు.