ఇజ్రాయెల్ తాజా దాడులు.. ఒకే ఫ్యామిలీలో 18 మంది మృతి

ఈ విషాద ఉదంతాన్ని అల్ అక్సా ఆసుపత్రి ధ్రువీకరించింది. తాజా దాడిలో ఒక వ్యాపారి కుటుంబం ఛిన్నాభిన్నమైంది.

Update: 2024-08-18 05:48 GMT

ఏం శాపమో కానీ ప్రపంచంలో మరే ఖండంలో లేనట్లు.. ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ చోటు చేసుకునే దాడులు.. యుద్దాలకు వేలాది సామాన్యులు మృత్యువాత పడే పరిస్థితి. పశ్చిమ దేశాలు హాయిగా బతుకు ఈడుస్తుంటే.. అందుకు భిన్నంగా ఆసియా మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అశాంతి. దీంతో ప్రాణాలు పోతూ.. రక్తం పారుతూ ఉండే దుస్థితి. ఏం పాపం చేశారో అన్నట్లుగా ఉండే దక్షిణాసియా ప్రాంతంలో మరోసారి అశాంతి రుగులుకుంది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్.. హమస్ ల మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ.. గాజాపై మరోసారి తన ప్రతాపాన్ని చూపింది ఇజ్రాయెల్.

తాజాగా జువైదా పట్టణంపై టెల్ అవీవ్ జరిపిన భీకర దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. ఈ విషాద ఉదంతాన్ని అల్ అక్సా ఆసుపత్రి ధ్రువీకరించింది. తాజా దాడిలో ఒక వ్యాపారి కుటుంబం ఛిన్నాభిన్నమైంది. సదరు వ్యాపారి.. ఇద్దరి భార్యలు.. 11 మంది పిల్లలు.. వారి అమ్మమ్మ మరో ముగ్గురు బంధువుల ప్రాణాలు పోయినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా లెబనాన్ లో నాబాతీహ్ ప్రావిన్స్ లో జరిగిన దాడిలో ఒక మహిళ.. ఇద్దరు పిల్లలతో సహా పది మంది మరణించారు.

తాము చేసిన దాడి హెచ్ బొల్లాకు చెందిన ఆయుధ నిల్వ కేంద్రాన్ని టార్గెట్ చేసినట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది. మరో ప్రత్యేక దాడిని తీర ప్రాంతమైన టైర్ నగరంలోని ఒక నిర్దిష్ట లక్ష్యంపై చేశారు. ఈ దాడిలో హెజ్ బొలా కమాండర్ హతమైనట్లుగా పేర్కొన్నారు. సెంట్రల్ గాజాలోని మాఘాజీ శరణార్థి శిబిరం.. పరిసర ప్రాంతాల్లోని పాలస్తీనీయన్లు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన పది నెలల్లో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి.

ఇజ్రాయెల్ - హమస్ మధ్య జరిగిన యుద్ధంలో ఇప్పటివరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజా హెల్త్ మినిస్ట్రీ తాజా ప్రకటనను చూస్తే.. ఇజ్రాయెల్ దాడులతో ఎంతటి విషాదం నెలకొందో అర్థమవుతుంది. ఈ యుద్ధంలో 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతే.. 92 వేల మందికి పైగా గాయపడ్డారు. గాజాలో 85 శాతం మంది ప్రజలు ఇండ్లను విడిచి పెట్టి వలస వెళ్లిపోయిన పరిస్థితి. గత ఏడాది అక్టోబరు 7న హమస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద దాడి చేయటం.. ఒకే దఫా 1200 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని చంపటం.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లటం తెలిసిందే.

అప్పటి నుంచి మొదలైన ప్రతీకారదాడులకు వేలాది మంది సామాన్యులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక భవనాలు.. ఆసుపత్రులు.. మసీదులు.. స్కూళ్లు నేలమట్టం అయ్యాయి. ప్రజలు మంచినీళ్లు.. ఆహారం.. మెడిసిన్లు సైతం దొరకని పరిస్థితి. తాత్కాలికంగా నిర్మించిన షెల్టర్లలోఉంటున్నారు. దాదాపు 5 లక్షల వరకు ఉన్న జనాభాలో ఐదు వంతు కంటే ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తున్నారు. దాడుల్లో చనిపోతున్న వారిని పూడ్చేందుకు శ్మశానాల్లో చోటు లేకపోవటంతో.. ఇళ్ల మెట్ల కింద పూడ్చేస్తున్నారు. ఎవరు ఎవరిపై దాడి చేసుకున్నా.. బలి అయ్యేది మాత్రం సాదాసీదా ప్రజలు మాత్రమే. పాలకులు ఈ విషయాన్నిఎందుకు మిస్ అవుతారో?

Tags:    

Similar News