ఇజ్రాయెల్ – పాలస్తీనా అసలు గొడవ దీని గురించే!
ఇప్పటికే రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచమంతా ఆందోళనతో ఉంటే ఇప్పుడు పులి మీద పుట్రలా పశ్చిమాసియాలో అగ్గి రాజుకుంది.
ఇప్పటికే రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచమంతా ఆందోళనతో ఉంటే ఇప్పుడు పులి మీద పుట్రలా పశ్చిమాసియాలో అగ్గి రాజుకుంది. యూదు దేశమైన ఇజ్రాయెల్ పై పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాద సంస్థ 5 వేల రాకెట్లతో దాడి చేసి 300 మందికి ఇజ్రాయెల్ పౌరులను పొట్టనపెట్టుకుంది. మరెంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో భగ్గుమన్న ఇజ్రాయెల్.. యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ ను ప్రారంభించింది.
కాగా ఇజ్రాయెల్–పాలస్తీనాల గొడవ ఇప్పటిది కాదు. 1948లో ఇజ్రాయెల్ ఆవిర్భావానికి ముందు నుంచే ఆరని చిచ్చులా ఈ గొడవ రగులుతూనే ఉంది. అది చిలికిచిలికి గాలివానగా మారి అనేక యుద్ధాలకు కారణభూతమైంది. మధ్య ఆసియాలో మధ్యధరా సముద్రం–జోర్డాన్ నది మధ్య ప్రాంతాన్ని పాలస్తీనాగా పిలుస్తున్నారు. యూదు, క్రై స్తవ మతాలు ఇక్కడే పుట్టడం గమనార్హం.
చరిత్రను తవ్వితే పురాతన ఈజిప్టు రాజులు, పర్షియా చక్రవర్తులు, అలెగ్జాండర్ నుంచి ఒట్టోమాన్ చక్రవర్తి దాకా అనేకమంది రాజులు పాలస్తీనాను పరిపాలించారు. 1914కు ముందు వరకు ఈ ప్రాంతం ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉంది. అయితే అదే సంవత్సరంలో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమాన్ చక్రవర్తి ఓడిపోవటంతో పాలస్తీనా ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది.
పాలస్తీనా... బ్రిటన్ అధీనంలోకి వచ్చేనాటికి ఈ ప్రాంతంలో యూదులు మైనార్టీలుగా ఉండేవారు. ఇక అరబ్బులు అధిక సంఖ్యలో ఉండేవారు. యూదులు పాలస్తీనాను తమ పుట్టినిల్లుగా భావించేవారు. ఈ క్రమంలో అరబ్బులు అందుకు అంగీకరించేవారు కాదు. ఇది యూదులు, అరబ్బుల మధ్య ఘర్షణకు దారితీసింది.
బ్రిటన్ ఏలుబడిలోకి వచ్చాక 1920 నుంచి 1948 దాకా పాలస్తీనాను బ్రిటన్ పరిపాలించింది. ఇక 1939లో రెండో ప్రపంచ యుద్ధ సమయానికి ఐరోపాలో జర్మనీ సహా కొన్ని దేశాల్లో యూదులపై దాడులు పెరిగాయి. దీంతో యూదులంతా తమ మాతృదేశమైన పాలస్తీనాకు వచ్చేశారు. ఈ క్రమంలో పాలస్తీనాను యూదు దేశంగా ప్రకటించాలన్న డిమాండ్ పెరిగింది.
ఈ నేపథ్యంలో పాలస్తీనాను యూదు, అరబ్ దేశాలుగా విభజించాలని 1947లో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. జెరుసలేం నగరాన్ని మాత్రం అంతర్జాతీయ నగరంగా తటస్థంగా ఉంచాలని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనకు యూదులు అంగీకరించినా, అరబ్బులు నిరాకరించారు. దీంతో జెరూసలేం నగరాన్ని తటస్థంగా ఉంచడానికి వీలుపడలేదు.
మరోవైపు యూదులు, అరబ్బుల మధ్య విభేదాలతో 1948లో బ్రిటన్ పాలస్తీనా నుంచి వైదొలగింది. దీంతో యూదు నేతలు ఇజ్రాయెల్ పేరుతో కొత్త దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పాలస్తీనాలోని అరబ్బులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో యుద్ధం తలెత్తింది. వేల మంది పాలస్తీనీయులు పారిపోయారు.
ఈ క్రమంలో ఏడాది తర్వాత అంటే 1949లో కాల్పుల విరమణ జరిగే సమయానికి పాలస్తీనాలో చాలా భాగం ఇజ్రాయెల్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ గా పిలుస్తున్న ప్రాంతాన్ని జోర్డాన్, గాజాగా పేరొందిన ప్రాంతాన్ని ఈజిప్టు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక పవిత్ర జెరుసలేం నగరంలో పశ్చిమ భాగం ఇజ్రాయెల్ కు, తూర్పు భాగం జోర్డాన్ చేజిక్కించుకున్నాయి. అయితే కాల్పుల విరమణే తప్ప శాంతి ఒప్పందం లేని కారణంగా కొన్ని దశాబ్దాలుగా అడపాదడపా యుద్ధం కొనసాగుతూనే వచ్చింది.
ఈ నేపథ్యంలో 1967లో తూర్పు జెరుసలేం, వెస్ట్ బ్యాంక్ లతోపాటు సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్టుకు చెందిన సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా ఇజ్రాయెల్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అనేకమంది పాలస్తీనా శరణార్థులు గాజా, వెస్ట్ బ్యాంకులతో పాటు చుట్టుపక్కలున్న జోర్డాన్, సిరియా, లెబనాన్ దేశాల్లో తలదాచుకున్నారు. అయితే వారెవరూ సొంతిళ్లకు తిరిగి రావటానికి ఇజ్రాయెల్ అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో 1973 అక్టోబరు 6న ఇజ్రాయెల్ పై ముప్పేట దాడి మొదలైంది. ఒకవైపు నుంచి ఈజిప్టు, మరోవైపు నుంచి సిరియా దాడికి దిగాయి. కొంతమంది దీన్ని అక్టోబరు యుద్ధమని, మరికొందరు యామ్ కిప్పూర్ యుద్ధమని, ఇంకొందరు రమదాన్ యుద్ధమని, ఇతరులు నాలుగో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధమని పిలిచారు.
1948లో కొత్తగా ఏర్పడి.. అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల మద్దతుతో 3 సార్లు అరబ్ దేశాలను ఓడించి ఇజ్రాయెల్ మంచి ఊపుమీదున్న దశలో అనూహ్యంగా సిరియా, ఈజిప్టులతో వచ్చింది. సినాయ్ ద్వీపకల్పాన్ని మళ్లీ స్వాధీనం చేసుకునేందుకు ఈజిప్టు, గోలన్ హైట్స్ కోసం సిరియా... ఇజ్రాయెల్ పై ఈ యుద్ధానికి దిగాయి. ఈ రెండు ప్రాంతాలనూ అంతకుముందు 1967లో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. వాటిని తిరిగి సంపాదించేందుకు ఈజిప్టు, సిరియా యుద్ధానికి దిగాయి.
ఈ క్రమంలో అరబ్ దేశాలకు సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) అండగా నిలవగా, ఇజ్రాయెల్ కు అమెరికా అండగా నిలిచింది. మొదట్లో చేతులెత్తేసినట్టు కనిపించిన ఇజ్రాయెల్ కు.. అమెరికా అన్ని విధాలుగా సాయం చేయడంతో ఆ దేశం పుంజుకుంది. అమెరికా నిఘా సమాచారాన్ని అందివ్వడంతో పాటు విమానాల్లో భారీ ఎత్తున ఆయుధాలను అందించింది. పది రోజుల తర్వాత అంటే 1973 అక్టోబరు 16న ఇజ్రాయెల్ దళాలు ఈజిప్టు, సిరియా సరిహద్దులను దాటి ఆ దేశాలపై పట్టు సాధించింది. ఈజిప్టు జీవనాడి, ఆర్థిక నాడి అయిన సూయజ్ కాలువపై ఇజ్రాయెల్ పట్టు బిగించింది.
అమెరికా అండతో యుద్ధం 12వ రోజుకు చేరుకోగానే అరబ్ దేశాలు చమురు అస్త్రాన్ని ప్రయోగించాయి. చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించడంతోపాటు అమెరికాకు సరఫరాపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. వెంటనే అమెరికా చాణుక్యుడిగా పేరొందిన అప్పటి విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ రంగంలోకి దిగారు. దౌత్యం చేపట్టారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్యం నెరిపారు. మొత్తానికి యుద్ధాన్ని ఆపించి అరబ్, ఇజ్రాయెల్ శాంతించేలా చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ – ఈజిప్టుల మధ్య 1978లో ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ ను దేశంగా ఈజిప్టు గుర్తించింది. ఓ అరబ్ దేశం ఇజ్రాయెల్ ను గుర్తించడం ఇదే తొలిసారి. ఆ తర్వాతి కాలంలో ఈజిప్టు క్రమంగా సోవియట్ యూనియన్ నీడలోంచి బయటకు వచ్చేసింది. ఈ యుద్ధానంతరం ఇజ్రాయెల్ రాబోయే ముప్పును దృష్టిలో ఉంచుకుని తన స్వీయ బలాన్ని భారీగా పెంచుకుంది. 50 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మళ్లీ ఇజ్రాయెల్‌పై పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ దాడులు చేయడం గమనార్హం.
వెస్ట్ బ్యాంక్ పై ఇప్పటికీ ఇజ్రాయెల్ దే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో పాలస్తీనీయులు ఎక్కువగా నివసించే తూర్పు జెరుసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తో పదేపదే ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గాజా ప్రస్తుతం పాలస్తీనా సాయుధ సంస్థ.. హమాస్ పాలనలో ఉంది. హమాస్ కు ఆయుధాలు అందకుండా గాజా సరిహద్దులను ఇజ్రాయెల్, ఈజిప్టు కట్టుదిట్టం చేస్తున్నాయి.
కాగా ప్రధాన సమస్యలు ఇప్పటికీ అక్కడ అలాగే ఉన్నాయి. అవి ఇజ్రాయెల్ తరహాలో పాలస్తీనా దేశాన్ని కూడా ఏర్పాటు చేయాలా, వద్దా? వెస్ట్ బ్యాంకులో ఏర్పాటైన యూదు నివాసాలు ఉంచాలా, తీసేయాలా?
పాలస్తీనా శరణార్థుల పరిస్థితి ఏంటి? జెరుసలేంను ఇరుపక్షాలకూ సమంగా పంచాలా? అనేవి. వీటికోసమే తరచూ ఘర్షణలు, యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి.
2006లో ఇజ్రాయెల్ ను గుర్తించడానికి, హింసను విడిచిపెట్టడానికి హమాస్ నిరాకరించింది. దీంతో పాలస్తీనాకు ఆర్థిక సాయాన్ని ఇజ్రాయెల్, అమెరికా నిలిపివేశాయి. 2007లో గాజాను హమాస్ స్వాధీనం చేసుకుంది. 2008 డిసెంబరులో పాలస్తీనా సేనలు తమపైకి రాకెట్ దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. 22 రోజులపాటు ఇది కొనసాగింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలోగా దాదాపు 1,400 మంది పాలస్తీనా పౌరులు, 13 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. 2012లో నవంబరులో హమాస్ సైనికాధిపతి అహ్మద్ జబారీని ఇజ్రాయెల్ హతమార్చింది.
2014 జూలైలో ఇజ్రాయెల్ కు చెందిన ముగ్గురు యువకుల్ని హమాస్ హత్య చేసింది. దీంతో ఏడువారాల పాటు యుద్ధం జరిగింది. గాజాలో 2,100 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 67 మంది సైనికులు సహా 73 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. 2018 మార్చి గాజా కంచె ఉన్న సరిహద్దు వద్ద పాలస్తీనా నిరసనలు నిర్వహించింది. వారిని నిలువరించేందుకు ఇజ్రాయెల్ సేనలు కాల్పులు జరపగా 170 మంది మరణించారు.
2023 సెప్టెంబరు 26న హమాస్ సైనిక శిబిరంపై ఇజ్రాయెల్ సైనికులు డ్రోన్ల దాడి జరిపారు. గాజా నుంచి ఎరేజ్ వద్ద సరిహద్దు దాటే మార్గాన్ని ఇజ్రాయెల్ మూసివేయడంపై పాలస్తీనా ప్రజలు రోజూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.