ఇజ్రాయెల్ కర్కశం.. భూమ్మీద నరకం.. ఉన్మాద దాడితో 45 ప్రాణాలు బలి

అయితే, తొలినాళ్లలో ఇజ్రాయెల్ తమ దాడులను హమాస్ కేంద్రంగా జరిపింది. ఇప్పుడు మాత్రం పరిస్థితి అదుపుతప్పినట్లు కనిపిస్తోంది

Update: 2024-05-28 11:47 GMT

దాదాపు 8 నెలలవుతోంది.. ఇజ్రాయెల్- గాజా యుద్ధం మొదలై.. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్ర మూక చేసిన అనూహ్య దాడికి ఇజ్రాయెల్ ప్రతీకార చర్యతో సామాన్య ప్రజానీకం శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, తొలినాళ్లలో ఇజ్రాయెల్ తమ దాడులను హమాస్ కేంద్రంగా జరిపింది. ఇప్పుడు మాత్రం పరిస్థితి అదుపుతప్పినట్లు కనిపిస్తోంది. వందమంది పైగా బందీల విడుదల లక్ష్యంతో గాజాపైనే మొదట ఫోకస్ చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు రఫా పైనా విరుచుకుపడుతోంద. ఆ దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, అమెరికా సహా ప్రపంచమంతా మొత్తుకుంటున్నా ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రఫాపై భీకర వైమానిక దాడికి దిగింది.

ఇది అత్యంత పాశవిక దాడి..

తాజా దాడిలో 45 మంది చనిపోగా.. 60 మందిపైగా గాయపడ్డారు. ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇదే అత్యంత దారుణ దాడి అని చెబుతున్నారు. తాజాగా ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ సగం మంది మహిళలు, పిల్లలు ఉండడం గమనార్హం. కాగా, ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ బాంబింగ్ అనంతరం గుడారాలు దహనం అవుతున్న దృశ్యాలు, కాలిపోతున్న మృతదేహాలు, అవయవాలను కోల్పోయిన చిన్నారుల వీడియోలు బయటకు వచ్చాయి. ఇవి చూసినవారికి కళ్లవెంట నీరు వచ్చేలా ఉంది.

సురక్షిత ప్రాంతం అని చెప్పి..

యుద్ధంలోనూ ఒక నీతి ఉంటుంది. లొంగిపోయిన శత్రువును వదిలేయాలని, అశక్తులను చంపకూడదని.. చెబుతుంటారు. కానీ ఇజ్రాయెల్ ఇదేమీ పట్టించుకోవడం లేదు. ఆదివారం దాడి చేసిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ను సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే గతంలో ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో వచ్చిన పాలస్తీనియన్లు తల్ అల్ సుల్తాన్ లో గుడారాలు వేసుకున్నారు. అలాంటిచోటిపైనే ఇజ్రాయెల్‌ దాడి చేసిందంటే ఇందులో ఏదో ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది.

మిత్ర దేశాలూ నిరసించాయి..

ఇజ్రాయెల్ తాజా దాడిని దానికి అన్ని విషయాల్లో మద్దుతుగా ఉండే అమెరికా సహా ఫ్రాన్స్‌, స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే ఖండించాయి. ముస్లిం దేశాలైన ఈజిప్ట్, ఖతర్, తుర్కీయే అయితే మండిపడ్డాయి. ‘ఈ దారుణాన్ని ఆపండి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించండి. తక్షణం కాల్పుల విరమణ పాటించండి’’ అంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ట్వీట్ చేశాడు.

‘‘భూమి మీద నరకం గాజా. ఈ దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ తెలిపింది. కాగా, రఫాపై దాడిని తప్పిదమేనని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఒప్పుకొన్నారు. పౌరులకు హాని చేయకూడదని అన్నిప్రయత్నాలు చేసినా.. విషాద ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే, అంతర్జాతీయ ఒత్తిడికి మాత్రం లొంగే ప్రసక్తే లేదన్నారు. హమాస్‌ కమాండర్లు ఉన్నారని తమకు తెలిసిందని.. అందుకే తల్ సుల్తాన్ పై దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది.

యుద్ధం ఈజిప్టుకూ పాకుంతుందా?

గాజా-ఈజిప్టు సరిహద్దు రఫా క్రాసింగ్‌ వద్ద ఈజిప్టు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఈజిప్టు సైనికులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అనే సందేహం కలుగుతోంది. పాలస్తీనా వారికి మద్దతుగా హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రంలో ఐదు నౌకలపై తాము దాడి చేశామని హూతీ మిలిటెంట్లు ప్రకటించారు.

Tags:    

Similar News