చంద్రయాన్ -2 ఫెయిల్యూర్ ఎందుకో గుర్తించిన ఇస్రో
అంచనాలకు మించి పని చేస్తున్న చంద్రయాన్ -3 మరికొద్ది గంటల్లో విజయ పతాకాన్ని ఎగురువేసే వేళలో
అంచనాలకు మించి పని చేస్తున్న చంద్రయాన్ -3 మరికొద్ది గంటల్లో విజయ పతాకాన్ని ఎగురువేసే వేళలో.. గతంలో ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం ఎందుకు ఫెయిల్ అయ్యిందో తెలిపే ఫోటోల్ని పంపింది. చంద్రయాన్ 2కు చెందిన శకలాల్ని.. చంద్రయాన్ 3 ఫోటోలు తీసిన వేళ.. అసలేం జరిగింది? వైఫల్యం ఎక్కడ? కూలే ముందు ఏం జరిగింది? లాంటి అంశాల్ని తమకు అందిన డేటాతో పాటు.. తాజాగా అందిన ఫోటోలతో సిమ్యులేషన్ల ఆధారంగా ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అందులో కీలక అంశాల్ని చూస్తే..
- చంద్రయాన్ 2 ల్యాండింగ్ వేళ.. వేగాన్ని తగ్గించటానికి ఉద్దేశించిన థ్రాటల్ బుల్ ఇంజిన్లు.. సాఫ్ట్ వేర్ పరంగా జరిగిన ఇబ్బందులే ప్రయోగాన్ని దెబ్బ తీశాయి.
- ల్యాండింగ్ కు నాలుగు దశలు ఉన్నాయి. ల్యాండర్ వేగాన్ని గరిష్ఠంగా తగ్గించే రఫ్ బ్రేకింగ్ దశ ఒకటైతే.. కెమురా కోస్టింగ్ రెండో దశ. ఇక.. ఫైన్ బ్రేకింగ్ మూడో దశ అయితే.. టెర్మినల్ డిసెంట్ నాలుగో దశ. మొదటి దశ అనుకున్నది అనుకున్నట్లుగా సాఫీగా సాగింది.
- మొదటి దశ నాటికి ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి7.4 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చింది. రెండో దశ (కెమెరా కోస్టింగ్)లో ల్యాండర్ లోని కెమెరాలు.. సెన్సర్లు పని చేయటం షురూ చేవాయి. అవి ఫోటోలు తీసి.. శాస్త్రవేత్తలు అప్పటికే ల్యాండర్ లో అప్ లోడ్ చేసిన ఫోటోలతో సరి పోల్చుకొని.. తాను ల్యాండ్ కావాల్సిన ప్రదేశాన్ని నిర్దారణ చేసుకుంటాయి.
- ఈ దశలో ముందుకు వెళ్లాలా? వెనక్కి వెళ్లాలన్న నిర్ణయాన్ని తనకు తానుగా తీసుకునేలా ల్యాండర్ ను రూపొందించారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగటానికి వీలుగా వ్యోమనౌక 50 డిగ్రీల మేర మలుపు తిరిగేలా అల్గోరిథమ్ ను డిజైనర్లు రూపొందించారు. తాజాగా చంద్రయాన్ 3 పంపిన తాజా ఫోటోల్లో నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశానికి 482 మీటర్ల దూరంలో విక్రమ్ శకలాలు పడి ఉన్నట్లుగా తేలింది.
- గతంలోని డేటాను.. తాజా ఫోటోలను కలిపి విశ్లేషించగా.. రెండో దశలో నాలుగు ఇంజిన్ల ప్రజ్వలనలో లోపాలు తలెత్తాయి. ఒక్కో ఇంజిన్ 400 న్యూటర్ సామర్థ్యంలో మండేలా రూపొందించగా.. అందుకు భిన్నంగా పది శాతం అధిక థ్రస్టును ఉత్పత్తి చేశాయి. దీంతో.. ముందుగా డిసైడ్ చేసుకున్న దాని కంటే ఎక్కువగా వేగానికి బ్రేకులు పడ్డాయి. దీంతో.. ల్యాండర్ వేగం మరింత ఎక్కువగా తగ్గింది.
- స్పీడ్ కు సంబంధించి తలెత్తిన లోపాన్ని అప్పటికప్పుడు సరి చేస్తే ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. కెమెరాకోస్టింగ్ దశలో మొత్తం వ్యోమనౌకను 50 డిగ్రీల కోణంలో స్థిరంగా ఉంచాలన్న పరిమితులు లోపాల్ని సరిదిద్దుకునేందుకు అవకాశం లేకుండా చేసింది. దీంతో.. ల్యాండింగ్ లోపాలు ఎక్కువ అయ్యేలా చేసింది.
- ఫైన్ బ్రేకింగ్ దశ మొదలయ్యే సమయానికి వ్యోమనౌక అడ్డం.. నిలువు వేగాల్లో అంచనాలకు మించిన వైరుధ్యాలు వచ్చాయి.. దీంతో.. ల్యాండర్ కు నిర్దేశించిన గమ్యస్థానంలో సేఫ్ ల్యాండింగ్ కావటం కష్టమైంది. ఇలాంటి వేళ.. దిద్దుబాటు చర్యలకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించినా.. వ్యోమనౌక దశను తక్షణం మారాలన్న నిర్దేశాన్ని అందించినా.. అంత వేగంలో తన దిశను మార్చుకునే సామర్థ్యం ల్యాండర్ కు లేకుండాపోయింది.
- ముందుగా ల్యాండర్ కు పెట్టిన పరిమితులు శాపాలుగా మారాయి. సెకనుకు పది డిగ్రీలు మాత్రమే వంపు తిరిగేలా డిజైనర్లు పరిమితులు పెట్టి ఉంచారు. దీంతో.. అప్పటికప్పుడు మార్చిన మార్పులను పూర్తి చేయటానికి పదహారు సెన్లు అవసరమూతే.. దిద్దుబాటుకు పది సెకన్లు సమయమే ఉంది. దీంతో.. అనుకున్న మార్పు అనుకున్నట్లుగా సాగలేదు. దీంతో.. అధిక థ్రస్టు ఉత్పత్తి అయి.. ల్యాండర్ నిలువు వేగం బాగా పెరిగింది. ఇది ప్రయోగం ఫెయిల్ అయ్యేలా చేసింది.
- సేఫ్ ల్యాండింగ్ కు అవసరమైన సమయాన్ని తగ్గించేందుకు టైం సరిపోలేదు. ల్యాండ్ ప్రదేశం ఇంకా దూరంలోనే ఉందని గుర్తించింది. దీంతో అక్కడకు చేరుకోవాలంటే స్పీడ్ పెంచుకోవటమే మార్గమని అల్గోరిథమ్ భావించింది. అందుకు చేసిన ప్రయత్నంలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో గమ్యాస్థానానికి వెళ్లలేకపోవటం.. ఇటు వేగాన్ని తాను అనుకున్నట్లుగా వెళ్లేందుకు వీల్లేని పరిమితులు కట్టడి చేశాయి. దీంతో.. మితిమీరిన వేగంతో చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది.
- రఫ్ బ్రేకింగ్ దశ మొదలైన 716.2 సెకన్లకు చంద్రయాన్ 2 ల్యాండర్ నుంచి చివరి మెసేజ్ వచ్చింది. అది చంద్రుడి ఉపరితలానికి 335 మీటర్ల ఎత్తులో.. ల్యాండింగ్ ప్లేస్ కు 810 మీటర్ల దూరంలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ల్యాండర్ కుప్పకూలిన ప్రాంతం ఒక భారీ గుంతకు పక్కనే ఉన్నా.. సేఫ్ ప్లేస్ లోనే కుప్పకూలింది. ఒకవేళ.. అక్కడ ల్యాండ్ కావటం అనుకున్నట్లుగా సాగి ఉండే.. తదుపరి పరిశోధనలు అనుకున్నట్లుగా సాగేవి. ఈ నాలుగేళ్ల కాలానికి ఎన్నో కొత్త విషయాలు ప్రపంచానికి తెలిసేవి. గతంలో చోటు చేసుకున్న తప్పుల్ని సరిదిద్దుకొని.. ఇప్పుడు ప్రయోగించిన చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ దిశగా పరుగులు తీస్తోంది. ఈసారి విజయం పక్కా అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.