మిషన్ వీనస్.. ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన ఇస్రో ఛైర్మన్

ఒకటి తర్వాత ఒకటి చొప్పున సంచలన పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)

Update: 2023-09-28 04:36 GMT

ఒకటి తర్వాత ఒకటి చొప్పున సంచలన పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో). చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ తో పాఠం నేర్చుకొని.. సొంతంగా చంద్రయాన్ 3ను సక్సెస్ ఫుల్ గా చంద్రుడి మీద ల్యాండ్ చేయటమే కాదు.. అనుకున్నది అనుకున్నట్లుగా ప్రయోగాన్ని పూర్తి చేశారు. ఈ ప్రయోగం మధ్యలోనే మిషన్ ఆదిత్య పేరుతో సూర్యుడి గుట్టుమట్ల లెక్క తేల్చేందుకు పరిశోధనలు షురూ చేయటం.. ఇప్పుడా మిషన్ మధ్యలో ఉండటం తెలిసిందే.

తాజాగా ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. ఆసక్తికర వివరాల్ని వెల్లడించారు. ఆదిత్యఎల్1 విజయవంతంగా దూసుకెళుతున్న వేళ.. ఇప్పుడు శుక్ర గ్రహం మీద ఫోకస్ చేసినట్లుగా పేర్కొన్నారు. త్వరలోనే మిషన్ వీనస్ ను చేపట్టనున్న విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పేలోడ్లు డెవలప్ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.

సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి రెండో గ్రహంగా.. అత్యంత ప్రకాశవంతమైన గ్రహంగా పేరుంది. దీనిని ఎర్త్ సిస్టర్ ప్లానెట్ అని కూడా వ్యవహరిస్తారు. శుక్రుడిపై పూర్తిగా మందపాటి కార్బన్ డైయాక్సైడ్ వాతావరణం ఉంటుంది. చుట్టూ సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలతో కప్పబడి ఉంటుంది. లేత పసుపు రంగులో ఉండే శుక్ర గ్రహం అత్యంత వేడి గ్రహంగా చెబుతారు. శుక్ర గ్రహం చాలా ఆసక్తికర గ్రహమని ఆయన పేర్కొన్నారు.

దానిపై వాతావరణం చాలా మందంగా ఉంటుందన్నసోమనాథ్.. ''శుక్రుడి మీద వాతావరణ పీడనం భూమి కంటే వంద రెట్లు ఎక్కువ. 10వేల ఏళ్ల తర్వాత భూమి లక్షణాలు మారిపోవచ్చు. భూమి కూడా ఏదో ఒక రోజు శుక్రుడిలా కావొచ్చు'' అని పేర్కొన్నారు. మరోవైపు వీనస్ ను టార్గెట్ చేసిన అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో నాసా కూడా ఉంది. 2029-31 మధ్యలో శుక్రుడి మీద పరిశోధనల దిశగా ప్రయోగం చేసే వీలుంది. ఇస్రో అంతకు ముందే తన ప్రయోగాన్ని చేపడుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News