ఆ 'సెంటిమెంట్' ను తిరగరాస్తారా.. కొనసాగిస్తారా?
ఆ నియోజకవర్గాల గత చరిత్ర ఆధారంగా గెలిచే, ఓడే అభ్యర్థులెవరనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ నియోజకవర్గాల గత చరిత్ర ఆధారంగా గెలిచే, ఓడే అభ్యర్థులెవరనేది ఆసక్తికరంగా మారింది.
విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తొలిసారి ఏర్పడింది. ఈ క్రమంలో 2009లో ఈ నియోజకవర్గానికి 2009లో తొలిసారి ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి తైనాల విజయ్ కుమార్ గెలుపొందారు. రెండో స్థానంలో ప్రజారాజ్యం పార్టీ షేక్ రెహ్మాన్ నిలిచారు. టీడీపీ అభ్యర్థి మూడో స్థానానికి పడిపోయారు.
ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. వైసీపీ తరఫున పోటీ చేసిన చొక్కాకుల వెంకటరావుపై ఆయన గెలుపొందారు.
2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు నిలవగా మూడో స్థానంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన పసుపులేటి ఉషాకిరణ్ నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు నాలుగో స్థానానికి పడిపోయారు.
ఇలా ఇప్పటివరకు ఒకసారి గెలుపొందిన అభ్యర్థిని మరోసారి గెలిపించని చరిత్ర విశాఖ నార్త్ నియోజకవర్గ ప్రజలది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున మరోసారి కేకే రాజు పోటీ చేస్తుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి బరిలోకి దిగారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నుంచి తప్పుకుని భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు.
మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా విశాఖ నార్త్ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన తాను ఏర్పాటు చేసిన జై భారత్ నేషనల్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ ఉండటంతో వారిపైనే లక్ష్మీనారాయణ ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
ఇంకోవైపు వైసీపీ అభ్యర్థి కేకే రాజు గత ఎన్నికల్లో కేవలం 1944 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. మరోమారు ఆ పార్టీ తరఫున ఆయనే బరిలో ఉండటంతో సానుభూతిపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖ నార్త్ ప్రజలు తమ ఆనవాయితీని కొనసాగిస్తూ కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకుంటారా లేక సెంటిమెంటును బ్రేక్ చేస్తూ ఇప్పటికే ఒకసారి గెలిచిన విష్ణుకుమార్ రాజును గెలిపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.