ఇదేం పోయే కాలం? శ్మశానంలో ఎముకలు.. పుర్రెల చోరీ

శవాన్ని దహనం చేసిన తర్వాత మిగిలిన పుర్రెలు.. ఎముకల్ని చోరీ చేస్తున్న వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.

Update: 2024-02-19 04:17 GMT

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇదే పోయే కాలంరా బాబు అనేలా ఉన్న ఈ ఉదంతం గురించి విన్నంతనే ఒళ్లు జలదరింపు ఖాయం. శ్మశానాన్ని విడవకుండా దొంగతనం చేసే వీరి తీరు అనూహ్యం. ఆలోచించేందుకు సైతం మనసు ఒప్పుకోని పనులు చేస్తున్న వైనం షాకింగ్ గా మారింది. శవాన్ని దహనం చేసిన తర్వాత మిగిలిన పుర్రెలు.. ఎముకల్ని చోరీ చేస్తున్న వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. దొంగలించిన ఎముకల్ని ఏం చేస్తారు? అసలు వారు ఎందుకలా చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లోని హిందూ శ్మాశానవాటికలో రెండు రోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు దొంగతనం చేస్తూ స్థానికులకు దొరికిపోయారు. శవాల్ని కాల్చేయగా మిగిలిన ఎముకల్ని పోగుచేసి ఒక సంచీలో వేసుకొని తీసుకెళుతున్నారు. శుక్రవారం ఇలా ఇద్దరు యువకులు ఎముకల్ని చోరీ చేస్తుండగా పట్టుకుననారు. శనివారం సైతం ఇద్దరు మహిళలు కూడా శ్మశానంలో ఎముకల్ని పోగు చేస్తూ అక్కడి మున్సిపల్ సిబ్బందికి పట్టుబడ్డారు.

శవదహనం తర్వాత ఎముకల్ని కుటుంబ సభ్యులు సేకరించి వాటిని ఐదో రోజున కానీ తొమ్మిదో రోజున కానీ పదకొండో రోజున కానీ గోదావరి నదిలో కలపటం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. కొన్నిరోజులుగా శవదహనం తర్వాత శ్మశానంలో ఉముకలు కనిపించకపోవటంతో చాలామంది అవి కాలిపోయి ఉంటాయని భావించేవారు.

తాజాగా ఎముకల్ని దొంగతనం చేసే వారిని వరుస పెట్టి పట్టుకోవటంతో ఇంతకాలం తమ ఆత్మీయుల ఎముకల్ని ఇలానే దొంగతనం చేశారన్న విషయం అర్థమైన వారు షాక్ తింటున్నారు. ఇంతకూ చోరీ చేసిన ఎముకలతో వీరేం చేస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. చేతబడులు.. పూజలు చేసే వారికి సప్లై చేస్తారన్న ప్రచారం జరుగుతున్నా.. ఇంత భారీగా కొనుగోలు చేయటం వెనుక మరేదో కారణం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. ఎముకల చోరీ వెనుకున్న మిస్టరీని త్వరలో చేధిస్తామని చెబుతున్నారు.

Tags:    

Similar News