కుప్పంలో వైసీపీ ఆఫీస్ షట్టర్ మూసేశారా!?
అయితే నేతలు ఒకటి తలిస్తే.. ఓటర్లు మరొకటి తలచినట్లుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైనాట్ 175 నినాదంతో బయలుదేరిన వైసీపీ... ప్రధానంగా ఈసారి కుప్పంలో జెండా ఎగరేయాలని కంకణం కట్టుకుందని చెప్పేవారు. ఇలా కుప్పంలో చంద్రబాబుని ఓడించి.. వైసీపీ జెండా ఎగరేసే కీలక బాధ్యతను నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారని కథనాలొచ్చేవి. అయితే నేతలు ఒకటి తలిస్తే.. ఓటర్లు మరొకటి తలచినట్లుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
ఇందులో భాగంగా 175 స్థానాల్లోనూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఇక వైసీపీ ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పిన కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ పై చంద్రబాబు 48,006 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో... కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మూసివేసినట్లు కథనాలొస్తున్నాయి. అందుకు గల పలు కారణాలూ తెరపైకి వస్తున్నాయి.
అవును... కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మూసివేసినట్లు కథనాలొస్తున్నాయి. జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకూ కుప్పంలో ఎలాంటి పార్టీ కార్యకలాపాలు జరగలేదని అంటున్నారు. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అభ్యర్థి భరత్ కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదని చెబుతున్నారు.
ఇదే సమయంలో గతంలో కుప్పంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేరని అంటున్నారు. దీంతో... పార్టీ కార్యకర్తలు తదుపరి చర్యల గురించి ఆలోచిస్తున్నారని, ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది!
ఈ నేపథ్యంలో తాజాగా సుమారు 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 20 మంది సర్పంచులు, 60 మంది ఎంపీటీసీలు అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లాంచనంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నరని తెలుస్తోంది. ఇదే క్రమంలో... అతి త్వరలో కుప్పం నుంచి పలువురు వైసీపీ నాయకులూ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని అంటున్నారు.
కాగా... జూలై నెల మొదట్లో కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కూడా సుమారు 9మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశంలో చేరనున్నట్లు సంకేతాలు పంపారని.. ఈ మేరకు చంద్రబాబు కేబినెట్ లోని ఓ మంత్రితో ఈ విషయాన్ని చేరవేసినట్లు చెబుతున్నారు. అయితే... దీనికి చంద్రబాబు ఇప్పటికే ఆమోదం తెలిపారని.. త్వరలో దీనికీ ముహూర్తం ఫిక్సయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు!