మీ రాజకీయ ప్రసంగం నా దగ్గరా?: తెంపరి ట్రంప్‌కు షాకిచ్చిన న్యాయమూర్తి
అది వారికి రాజకీయంగా వచ్చిన అలవాటు. చట్టసభల్లో అయితే.. గంటల తరబడి ఉపన్యాసాలు చేసిన వారు కూడా ఉన్నారు.
రాజకీయ నేతలు ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా.. సుదీర్ఘ ఉపన్యాసాలు చేయడం సహజం. అది వారికి రాజకీయంగా వచ్చిన అలవాటు. చట్టసభల్లో అయితే.. గంటల తరబడి ఉపన్యాసాలు చేసిన వారు కూడా ఉన్నారు. ఇక, ఎన్నికల వేళ నిర్వహించే ర్యాలీలు, సభల్లో అయితే.. మైకులు పగిలిపోయేలా కూడా ప్రసంగిస్తారు. కానీ, ఎక్కడైనా రాజకీయ నాయకుడే కానీ.. కోర్టులకు కాదు కదా! పైగా.. న్యాయవ్యవస్థ అత్యంత కట్టుదిట్టంగా ఉన్న అమెరికాలో అయితే.. ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి.
కానీ, ఆయన గడసరి. ముక్కుమీదే కోపం. ఎవరినీ లెక్కచేయని తెంపరి తనం. ఆయనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అన్నిచోట్లా మాట్లాడినట్టే.. అందరితోనూ మాట్లాడినట్టే.. ఆయన కోర్టులోనూ రాజకీయ ఉపన్యాసం చేసేందుకు ప్రయత్నించారు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన న్యాయమూర్తి.. ట్రంప్‌కు చీవాట్లు పెట్టి.. మొట్టికాయలు వేసినంత పనిచేశారు. ``మీ రాజకీయ ప్రసంగాలు నా దగ్గరా!`` అని నిప్పులు చెరిగారు. అంతే.. నోరెత్తిన ట్రంప్.. నోర్మూసుకుని మౌనం పాటించారు.
ఏం జరిగిందంటే!
రాజకీయాల్లోకి రాకముందు.. ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బ్యాంకులు, బీమా కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందారు. దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను ఎక్కువ చూపించారనే ఆరోపణలతో ఆయనపై కేసులు నమోదుయ్యాయి. ఈ కేసులపై విచారణ ప్రారంభమైంది. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ట్రంప్ కూడా కోర్టుకు హాజరయ్యారు.
అయితే. .ఆయన న్యాయమూర్తి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మానేసి.. సుదీర్ఘ ప్రసంగాలు చేయడం.. రాజకీయ విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల ముందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కోర్టు హాల్‌లో ట్రంప్ అన్నారు. కోర్టుల్లో కాలయాపన చేస్తూ తన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.
విచారణ అసంబద్ధంగా జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో ట్రంప్ బ్రాండ్ విలువను కలపకుండానే ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం తన బ్రాండ్‌తోనే ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని అన్నారు. ట్రంప్ ప్రసంగంతో విసిగిన న్యాయమూర్తి మందలించారు. చీవాట్లు పెట్టారు.
"ఇది రాజకీయ ర్యాలీ కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రసంగాలు వద్దు.' అని ట్రంప్‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోరోన్ హెచ్చరించారు. ట్రంప్‌ను ఎక్కువ మాట్లాడకుండా నియంత్రించాలని పిటిషనర్ తరుపు లాయర్‌పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఎక్కువగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు.