ఏపీ కాంగ్రెస్ పార్టీ పెద్ద జోక్ చేసింది!
ఉన్న కొద్దిమంది నేతలు కూడా మీడియా సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా, వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటంతోనే కాలం గడిపేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ పెద్ద జోక్ చేసింది. ఏపీకి సంబంధించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోను పోటీ చేయబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మీడియాతో చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు చెప్పారు. పోటీ చేసే విషయంలో రుద్రరాజు చేసిన ప్రకటన పెద్ద జోక్ గా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ భూస్ధాపితమైపోయింది. రాష్ట్ర విభజన చేయటం ద్వారా స్వయంగా సోనియాగాంధీనే ఏపీలో పార్టీకి సమాధి కట్టేసింది.
ఆ దెబ్బ నుండి పార్టీ ఇప్పటివరకు కోలుకోలేదు. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధుల్లో ఎవరికీ చెప్పుకోతగ్గ ఓట్లు రాలేదు. 2014 ఎన్నికల్లో కొంతమంది అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లయినా వచ్చాయి. 2019 ఎన్నికల్లో అయితే డిపాజిట్లు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలమని చెప్పుకుంటున్న వాళ్ళల్లో చాలామందికి జనాల్లో ఎలాంటి బలం లేదు. మిగిలిన వాళ్ళ సంగతిని వదిలేసినా పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు పరిస్ధితే దయనీయంగా ఉంది.
ఇపుడున్న నేతల్లో చాలామంది సొంతంగా పట్టుమని వంద ఓట్లు కూడా తెచ్చుకునే స్తోమత లేని వాళ్ళే. పోటీ చేయటానికి ఏముంది ఎవరో ఒకళ్ళకి బీ ఫారం ఇచ్చి నిలబెడతారు. కానీ ఓట్లు పడాలి కదా, తెచ్చుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ గురించి పట్టించుకుంటున్న మామూలే జనాలే ఎక్కడా కనబడటంలేదు. మిగిలిన పార్టీలైతే కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటుందని కూడా గుర్తించటంలేదు. 2014కి ముందు ఎంతో వైభవంగా ఉన్న పార్టీ చివరకు సీపీఐ, సీపీఎం స్ధాయికి పడిపోయింది.
ఉన్న కొద్దిమంది నేతలు కూడా మీడియా సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా, వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటంతోనే కాలం గడిపేస్తున్నారు. జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీడియాలో కాస్త హైలైట్ అవుతున్నారు కానీ లేకపోతే అదికూడా లేదు. 175 అసెంబ్లీ స్ధానాలతో పాటు 25 పార్లమెంటు సీట్లలోను పోటీ చేయబోతున్నట్లు రుద్రరాజు చాలా ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ ఎన్నికల్లో దిగిన తర్వాత కదా అసలు సమస్యలు తెలిసేది. చూద్దాం కాంగ్రెస్ కెపాసిటీ ఏమిటో తేలిపోతుంది కదా.