జాహ్నవిపై అనుచిత వ్యాఖ్యలు.. ఆ పోలీస్ పై వేటు!
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసు అధికారిపై సియాటెల్ పోలీస్ విభాగం వేటు వేసింది
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసు అధికారిపై సియాటెల్ పోలీస్ విభాగం వేటు వేసింది. ఆమె మృతిపై బాడీక్యామ్ కెమెరాలో వెకిలిగా నవ్వుతూ వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ ను గస్తీ విధుల నుంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ విభాగం ప్రకటించింది. మరోవైపు అతడికి కొత్తగా ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదని వెల్లడించింది. అయితే, అడెరర్ పై చర్యలు ఎప్పుడు తీసుకున్నదీ సియాటెల్ పోలీసు విభాగం ప్రకటించలేదు.
జనవరి 23వ తేదీన సియాటెల్ లో కెవిన్ డేవ్ పోలీసు అధికారి నడుపుతున్న వాహనం ఢీకొని రోడ్డు దాటుతున్న కందుల జాహ్నవి మృత్యువాత పడింది. ఈ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న మరో అధికారి డేనియల్ అడెరర్ తన బాడీక్యామ్ కెమెరాలో తోటి అధికారితో మాట్లాడుతూ వెకిలి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో అడెరర్ బాడీ కెమెరా రికార్డింగ్ ఆధారంగా అతడిని గస్తీ విధుల నుంచి తొలగించినట్టు సియాటెల్ పోలీసు విభాగం వెల్లడించింది.
కాగా అడెరర్ వ్యవహార శైలిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత్ కూడా ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మృతి చెందిన కందుల జాహ్నవి ఆంధ్రప్రదేశ్ యువతి కావడంతో చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలని భారత విదేశాంగ మంత్రికి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ సైతం రాశారు.
ఈ నేపథ్యంలో సియాటెల్ పోలీసు విభాగం అడెరర్ పై వేటు వేసింది. అయితే మరోవైపు తన చర్యను ఆడెరర్ సమర్థించుకున్నాడు. ఆమెపై తానెలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని.. కఠినమైన హృదయంతో ప్రవర్తించలేదని అక్టోబర్ మొదట్లో తెలిపాడు. ఈ మేరకు సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ కి ఆడెరర్ లేఖ రాశాడు. అంతేకాకుండా ఆమె మరణం తనను కలచివేసిందని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.
సీటెల్ కమ్యూనిటీ పోలీస్ కమీషన్.. కందుల జాహ్నవి మరణం గురించి సరదాగా మాట్లాడినందుకు విచారణలో ఉన్న ఆడెరర్ ను సెలవులో ఉంచాలని, అతని వేతనాన్ని నిలిపివేయాలని సిఫార్సు చేసింది.
మరోవైపు ఆడెరర్ పై న్యాయస్థానంలోనూ కేసు నమోదైంది. ఆగస్టు 2న న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. కాగా సౌత్ లేక్ యూనియన్ లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్శిటీ క్యాంపస్‌కు చెందిన కందుల జాహ్నవి జనవరి 23 రాత్రి పాదచారుల క్రాసింగ్ వద్ద అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పోలీస్ వాహనం ఢీకొనడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో గస్తీ విధుల్లో భాగంగా అక్కడకు వెళ్లిన ఆడెరర్ తన తోటి అధికారితో ఆమె మరణం గురించి వెకిలిగా మాట్లాడారు. అదంతా ఆడెరర్ బ్యాడీ కెమెరాలో రికార్డు అయింది. ఆ తర్వాత ఈ వీడియో ఆలస్యంగా వెలుగుచూడటంతో భారత్ తో సహా వివిధ దేశాలు, నెటిజన్లు అతడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.