అదంతే: జనాలకు కొత్తకాదు.. జగన్‌కూ కొత్తకాదు..!
ఆ దిశగా జగన్ ఆలోచనలు ముందుకు సాగాలి. ప్రస్తుతం జగన్‌ను ముందుకు నడిపించేందుకు ఉన్న అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి.
కొన్ని కొన్ని విషయాలకు.. నాయకులకంటే కూడా.. జనాలకు బాగా తెలుసు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యవహారం కూడా.. జనాలకు కొత్త కాదనే టాక్ వినిపిస్తోంది. సమయం చూసుకుని మా నాయకుడు ప్రజల మధ్యకు వస్తాడని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక, ఇదే తరహాలో జగన్ కూడా ఉన్నారు. కానీ, ఎటొచ్చీ.. జనాల్లో మాత్రం వైసీపీ పై సింపతీ పెరగడం లేదు. జగన్‌పై అసలే లేదు. ఇదంతా జరగాలంటే.. జనాలకు పాతే అయిన విధానాలను వదిలేసి.. కొత్తవాటివైపు ఆయన అడుగులు వేయా లి.
ఆ దిశగా జగన్ ఆలోచనలు ముందుకు సాగాలి. ప్రస్తుతం జగన్‌ను ముందుకు నడిపించేందుకు ఉన్న అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. స్ట్రాటజీ లేదు. తాము చేస్తున్న నిరసనలపై తమకే క్లారిటీ ఉండడం లేదు. రైతుల కోసం ఒకసారి, విద్యార్థుల కోసం మరోసారి, విద్యుత్‌పై ఇంకోసారి వైసీపీ నిరసన లు చేసినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. జనాల నుంచిస్పందన లేని.. ఏ ఉద్యమమైనా.. పక్కకు వెళ్లిపోవాల్సిందే. ఒకప్పుడు మద్య నిషేధం కోసం.. జనం కదిలారు. నేడు అలాంటి పరిస్థితి లేదు.
రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం కూడా.. జనాలు కదలేక పోయారు. ఫలితంగా.. కొందరు నాయకులు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా.. చేతులు ముడుచుకున్నారు. సో.. వైసీపీ ఇప్పుడు చేస్తున్న ఉద్యమాలు, నిరసనలు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి. అంటే.. ఈ నిరసనలు, ఈ ధర్నాలు జనాలకు కొత్తకాదు. అలానే... జగన్‌కు కూడా కొత్తకాదు! ప్రజలు పట్టించుకుంటారో కోరో తెలియనంత అమాయకుడు అయితే జగన్ కాదు. కాబట్టి.. ఆయన కూడా మౌనంగా ఉన్నారు.
ఇప్పుడు ఏం చేయాలి..
ఒకప్పుడు వామపక్ష పార్టీలు ప్రజలను చైతన్య పరిచాయి. అయితే.. ఉద్యమాలకు సహకరించిన ప్రజలు ఓట్ల విషయానికి వస్తే.. కామ్రెడ్లను పూర్తిగా పక్కన పెట్టాయి. ఫలితంగా ఇప్పుడు ఏపీలో ఉద్యమాలు కానీ.. ప్రశ్నించే వారు కానీ.. లేకుండా పోయారు. జగన్ ఆదిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. పార్టీని డెవలప్ చేయాలంటే.. ముందు ప్రజల్లోనే చైతన్యం తీసుకురావాలి. లేకపోతే.. ఆయన ఎంత ప్రయత్నించినా.. ఒకవైపు వాయిద్యం మాదిరిగానే పరిస్థితి ఉంటుంది. ముందుగా ఆయన ప్రజల మధ్యకు రావాలి.. ముద్దులు కురిపించడం కాదు.. వారిలో చైతన్యం తెచ్చేలాగా ప్రయత్నించాలి. అప్పుడే జనాలకు కొత్తరుచులు తెలుస్తాయి. లేకపోతే.. జనాలకు కొత్తకాదు.. జగన్‌కూ కొత్తకాదు! అనే నానుడి నిజమవుతుంది.