వరద వేళ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్!

చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో భారీ వరదలతో విజయవాడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Update: 2024-09-03 03:30 GMT

చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో భారీ వరదలతో విజయవాడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాది మంది వరద మునకలో బిక్కుబిక్కుమంటున్నారు. విజయవాడలోని అత్యధిక భాగాలు.. వరదలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇలాంటి వేళ.. సహాయక చర్యల కోసం చంద్రబాబు ప్రభుత్వం కిందా మీదా పడుతోంది. ఈ క్రమంలో.. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం విజయవాడలోని పలు ప్రాంతాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వరద బాధితుల్ని ఆదుకోవటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నారు. సోమవారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించారు.

కనీసం మంచినీరు కూడా సరఫరా చేయటం లేదని.. పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయలేదని.. ఎలాంటి సహాయక చర్యల్ని చేపట్టటం లేదని మండిపడ్డారు. బాధితులకు తగినంత ఆహారం.. వారిని తరలించేందుకు తగిన సంఖ్యలో బోట్లను సమకూర్చలేదని విరుచుకుపడ్డారు. ‘‘గతంలో ఇంతకు మించిన ఎక్కువ వర్షాలే కురిశాయి. కానీ.. ఏ రోజు ప్రజలు ఈ స్థాయిలో బాధ పడలేదు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాలన మీద ఫోకస్ పెట్టాలి. వరద బాధితులకు తక్షణమే క్షమాపణలు చెప్పి సహాయక చర్యలు చేపట్టాలి’’ అంటూ జగన్ సీరియస్ అయ్యారు.

ఫ్లైఓవర్ మీదుగా వాహనంలో సింగ్ నగర్ కు వెళ్లేందుకు అధికారులు నో చెప్పటంతో.. సింగ్ నగర్.. ముత్యాలంపాడు.. ప్రకాశ్ నగర్ లకు నడుచుకుంటూ వెళ్లారు. వరద బాధితుల్ని వ్యక్తిగంగా కలుసుకున్న జగన్.. వారి కష్టాల్్ని.. వారు పడుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. వారి బాధల్ని విన్న జగన్.. వారిని ఓదార్చారు. బాధితుల తరఫు పోరాడతానని.. వరద బాధితులకు హామీ ఇచ్చారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని గత నెల 28న వాతావరణ శాఖ హెచ్చరించిందని.. 20సెంటీమీటర్ల మేర వర్షం పడుతుందని ముందే చెప్పిందన్నారు.

అత్యధిక వర్షపాతం గురించి కూటమి ప్రభుత్వం సరిగా స్పందించలేదన్న జగన్.. ‘‘అధికారులతో చంద్రబాబు కనీస సమీక్ష జరపలేదు. వరదను నియంత్రించేలా జలవనరులు.. రెవెన్యూ.. హోంశాఖ అధికారులతో రివ్యూ చేయలేదు. దిగువన ఉన్న ప్రాంతాలే కాదు ఎగువన ఉన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ ఇదే రీతిలో వర్షాలు పడతాయని ముందస్తు సమాచారం అందినా కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. బుడమేరులో వరద పోటెత్తటంతో ప్రజలను అప్రమత్తం చేయకుండా శనివారం అర్థరాత్రి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11 లాకులు ఎత్తేశారు. దీంతో వరద నీరు విజయవాడను ముంచెత్తింది. చంద్రబాబు ఉంటున్న ఇంటి కరకట్టను కాపాడుకోవటం కోసం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తేసి బుడమేరు వరదను మళ్లించారు. విజయవాడను ముంచెత్తారు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

విజయవాడకు వరదలు ప్రభుత్వ తప్పిదం.. మ్యాన్ మేడ్ ఫ్లడ్ మాత్రమేనని మండిపడ్డ జగన్.. వరద బాధితులతో మాట్లాడినప్పుడు ఎవరూ కూడా సాయం అందినట్లుగా చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఒక్క బాధితుడైనా రిలీఫ్ క్యాంపులకు పోతున్నామని.. ఫలానా చోట ఏర్పాటు చేశామని చెప్పలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. రెండు రోజుల్లో కనీస సాయం ఏమైనా అందిందా? ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారా? డబ్బుల సంగతి దేవుడెరుగు.. మంచి నీళ్లు ఇచ్ే నాథుడు కూడా లేడని బాధితులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి విపత్తు ఏర్పడితే వలంటీర్ల సైన్యం అక్కడ ఉండేదన్న జగన్.. ప్రతి కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది కూడా తమ ప్రభుత్వంలోనే అంటూ తమ సర్కారు గురించి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News