జగన్ పులివెందుల ఎమ్మెల్యేయేనా ?
జగన్ పార్టీకి కి ఈసారి 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో లేకుండా పోయింది.;
వైసీపీ అధినేత మాజీ సీఎం ని టీడీపీ కూటమి నేతలు మంత్రులు అంతా పొలిటికల్ గా ర్యాగింగ్ చేస్తూ అనే మాట ఒకటి ఉంది. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని. జగన్ పార్టీకి కి ఈసారి 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో లేకుండా పోయింది. దాని మీద ఆయన ఫైట్ చేస్తూ అసెంబ్లీకి దూరం పాటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన మీద పులివెందుల ఎమ్మెల్యే అని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు. జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఆయనకు అందరి ఎమ్మెల్యేల మాదిరిగానే సభలో మాట్లాడేందుకు సమయం ఇస్తామని ప్రత్యేక ప్రివిలేజెస్ ఏవీ ఉండవని సెటైర్లు వేస్తూ ఉంటారు.
సరే ప్రత్యర్ధి పార్టీలు అన్నాక రాజకీయ విమర్శలు చేయడం సహజం. వాటిని వైసీపీ నేతలు కూడా తిప్పికొడుతూ వచ్చారు. అది వేరే విషయం. కానీ జగన్ గత పది నెలల కాలంలో అనుసరిస్తున్న వైఖరి చూస్తూంటే కూటమి నేతలు అనడం కాదు ఆయనకు ఆయనే పులివెందుల ఎమ్మెల్యేగానే తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
జగన్ వైసీపీ ఓడాక ఉంటే బెంగళూరులో ఉంటున్నారు. లేకపోతే ఎక్కువ సమయం గడిపేది పులివెందులలోనే అని అంటున్నారు. ఈ విషయం లెక్కలతో సహా నిరూపితం చేస్తున్నారు. జగన్ నెలలో నాలుగైదు సార్లు పులివెందులకు వస్తున్నారు. ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. అంతే కాదు జనంతో మమేకం అవుతున్నారు.
ఎవరి ఇళ్ళలో శుభాలు ఉన్నా లేక అశుభాలు అయినా ఆయన కంపల్సరీగా వెళ్ళి పరామర్శిస్తున్నారు. మరి ఇంతలా జగన్ పులివెందులలో పర్యటనలు చేయడం వెనక ఏమి ఉంది అంటే కూటమి ప్రభుత్వం పులివెందులను టార్గెట్ చేయడమే అని అంటున్నారు. టీడీపీ పుట్టాక ఎన్నడూ కడపలో మహానాడు పెట్టలేదు. ఈసారి అక్కడే పార్టీ పండుగ అని నేతలు మొదట అనౌన్స్ చేశారు. ఇపుడు చూస్తే ఏకంగా పులివెందులలో అంటున్నారు. దానికి కారణం జగన్ సొంత ఇలాకాలో ఆయన్ని రాజకీయంగా సవాల్ చేయడమే అని అంటున్నారు.
ఇక పులివెందులలో మహానాడు అంటే రాజకీయ మసాలా లేకపోతే మామూలుగా ఉండదు కదా. వైసీపీ నుంచి ద్వితీయ తృతీయ శ్రేణి నేతలను తమ పార్టీలోకి తీసుకోవాలని కూటమి మాస్టర్ ప్లాన్ చేస్తోంది. దాంతోనే ఇపుడు వైసీపీ అధినాయకత్వం ఫోకస్ పులివెందుల మీద పడింది అని అంటున్నారు వైసీపీ నేతలతో టచ్ లో ఉండడం వారికి భరోసా ఇవ్వడంతో పాటు ఎవరూ కూటమి వైపు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారుట.
అంతే కాదు, పులివెందులలో 2019లో భారీ మెజారిటీని సాధించి రికార్డు సృష్టించిన జగన్ కి 2024లో అది కాస్తా బాగా తగ్గింది. దానికి కారణం సొంత చెల్లెలు కాంగ్రెస్ నుంచి సవాల్ చేయడం మాజీ మంత్రి బాబాయ్ వివేకా హత్య కేసు మీద ప్రచారంతో జనంలో వైసీపీ ఇరకాటంలో పడింది. దాంతో పులివెందులలో మెజారిటీ తగ్గింది.
ఈ రోజుకీ జగన్ కి పులివెందులలో ఇమేజ్ చెక్కు చెదరనిదే అని చెబుతారు. అలాగని ధీమాగా ఉండకుండా జగన్ తన పట్టుని గట్టిగా పెంచుకునేందుకే తరచూ పులివెందులలో పర్యటిస్తున్నారు అని అంటున్నారు. తాజాగా అకాల వర్షాలతో అనంతపురం కడప జిల్లాలో భారీ ఎత్తున అరటి సహా ఇతర ఉద్యాన వన పంటలు సర్వ నాశనం అయ్యాయి. అయితే జగన్ హుటాహుటీన పులివెందులకు చేరుకుని అరటి రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఆ విధంగా తన తొలి ప్రయారిటీ పులివెందులకే అని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల అన్నది 1978 నుంచి వైఎస్సార్ ఫ్యామిలీకే కట్టుబడిపోయింది. వైఎస్సార్ అయిదు సార్లు, విజయమ్మ ఒకసారి గెలిస్తే జగన్ మూడు సార్లు గెలిచారు. అలాంటి కంచుకోట మీద చిన్నపాటి గీటు అయినా పడకుండా కాపాడుకునే ప్రయత్నమే జగన్ ని పులివెందులకు తరచూ వచ్చేలా చేస్తోంది అని అంటున్నారు.
జగన్ ని పులివెందుల ఎమ్మెల్యే అని ఎవరు అనుకున్నా ఫరవాలేదు కానీ ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలని అలాగే కడప జిల్లా ఆ మీదట రాయలసీమ రీజియన్ ఇలా జగన్ ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. సో ఆయన సీఎం గా ఉన్నపుడు కానీ అంతకు ముందు కానీ ఇన్ని సార్లు పర్యటించలేదు అని ఇపుడు విపక్షంలోకి వచ్చాక మాత్రం పులివెందుల అని కలియతిరుగుతున్నారని ప్రత్యర్ధులు అంటున్నారు.