జగన్ ఆశలపై నీళ్లు చల్లుతున్న చంద్రబాబు ..!
ఏపీ మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ పెట్టుకున్న ఆశలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నీళ్లు చల్లుతున్నారు.
ఏపీ మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ పెట్టుకున్న ఆశలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నీళ్లు చల్లుతున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ఎన్నికల కోసం జగన్ వేచి చూస్తున్నారు. ఆరు మాసాల్లోనే సర్కారు విఫలమైందని ఆయన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కూటమి సర్కారుకు ప్రజలు బుద్ధి చెబుతారని కూడా ఆయన అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును తీసుకువచ్చింది. ఇప్పటికే కేంద్రం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని పార్లమెంటులో ఆమోదించుకుని.. రాజ్యాంగానికి కొన్ని సవరణలు చేసి.. ఈ బిల్లును ఆమోదించుకుంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ ఒకే సారి ఎన్నికలు వస్తాయి. అయితే.. ఈ ఎన్నికలు 2026-27 మధ్యలోనే వస్తాయన్నది జగన్ ఉద్దేశం. అంటే.. దీనికి మరో రెండు సంత్సరాలు కూడా సమయం లేదు.
వాస్తవానికి రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరగాలంటే.. నాలుగున్నరేళ్లు ఆగాలి. కానీ.. జమిలి ఎన్నికలు వస్తే మాత్రమే వచ్చే రెండేళ్లలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జగన్ తలపోస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు కూడా చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల అవంతి శ్రీనివాస్ కూడా చెప్పుకొచ్చా రు. జమిలి ఎన్నికలు వస్తున్నాయనే జగన్ రోడ్డు మీదకు వస్తున్నారని.. తమను కూడా రమ్మంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయం వైసీపీలోనూ చర్చగానే మారింది.
అంటే మొత్తంగా జగన్ ఆశలు ఇప్పుడు జమిలిపైనే ఉన్నాయి. వచ్చే నాలుగున్నరేళ్ల పాటు ఆయన సైలెంట్‌గా ఉండే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జమిలికి అనుకూలంగా వైసీపీ ఎంపీలు కూడా మద్దతు తెలపనున్నారు. ఈ ఎన్నికలు వస్తే.. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావాలన్నది జగన్ తాలూకు ఆలోచనగా ఉంది. ఇదిలావుంటే.. చంద్రబాబు మాత్రం .. జమిలి వచ్చినా.. ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనేనని తెగేసి చెబుతున్నారు. సో.. ఇది వైసీపీ ఆశలపై నీళ్లు జల్లినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.