జగన్‌ను వెంటాడుతున్న 'మూడు' హామీలు!
అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావాలని కోరుకుని ఉండొచ్చు.(కోరుకుంటున్నారు కూడా) కానీ, రావు
అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావాలని కోరుకుని ఉండొచ్చు.(కోరుకుంటున్నారు కూడా) కానీ, రావు. వచ్చినా.. ఆయన గెలిచే పరిస్థితి లేదు. కానీ, దీనిని ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే.. చంద్రబాబు ఇస్తానన్న మాతృవందనం ఇవ్వలేదుగా అంటున్నారు. ఇంకోమాట చెప్పమంటే.. రైతులకు ఇస్తానన్న రూ.20 వేల గురించి మాట్లాడడం లేదుగా అంటున్నారు. అంతేతప్ప.. తానుజనంలో వస్తే.. తనకు ఎదురయ్యే ప్రశ్నల గురించి మరిచిపోతున్నారు.
ఓడిపోయినంత మాత్రాన, 11 స్థానాలకే పరిమితమైనంత మాత్రాన జనాలు `గతం` అంత తొందరగా మరిచిపోరు. ఇదే నిజమైతే.. కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్కసీటైనా ఇచ్చేవారు కదా!? గొంతు చించుకుని గగ్గోలు పెట్టిన వైఎస్ షర్మిలకు కనీసం కడప సీటైనా దక్కి ఉండేది కదా! సో.. ప్రజలు అంత గుర్తులేని వారు.. మతిమరుపు మనుషులు అనుకుంటే పొరపాటే. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. జగన్ ఇచ్చిన కీలక హామీల్లో మూడు ఆయన మరిచిపోయారు. జనాలు గుర్తు పెట్టుకున్నారు.
అవన్నీ కూడా.. సమాజాన్ని మూడు వర్గాలుగా విభజిస్తే.. ఆ మూడు హామీలు కూడా.. మూడు వర్గాలపై ప్రభావం చూపించినవే. కానీ, జగన్ మాత్రం వాటిని లైట్ తీసుకున్నారు. ఆ ఏమవుతుందిలే.. జనాలు మరిచిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ, ఇప్పటికీ.. ఆ మూడు హామీలు లైవ్‌లో ఉన్నాయి. 1) మెగా డీఎస్సీ. ఇది లక్షలాది మంది నిరుద్యోగులకు కలలు రేపిన జగన్ కీలక హామీ. 2019లో అధికారంలో రాగానే నెరవేరుస్తానన్న హామీ. కానీ, ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేకపోయారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ హామీని మరిచిపోలేక పోతున్నారు.
2) సీపీఎస్ రద్దు. ఇది ఉద్యోగులకు సంబంధించిన కీలక హామీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ రద్దుపై కూడా జగన్ హామీ ఇచ్చారు. దీనిని కూడా ఐదేళ్లలో ఆయన నెరవేర్చలేక పోయారు. 3) విడతల వారీగా మద్య నిషేధం. దీనికి పై రెండింటికి తేడా ఉంది. పైరెండు హామీలను వారు కోరుకుంటే జగన్ ఇచ్చారు. ఈ మూడో హామీని మాత్రం ఎవరూ కోరకుండా.. ఆయనే ఇచ్చారు. కానీ, దీనిని నెరవేర్చకపోగా.. నాసిరకం మద్యం విక్రయించారు. ఇది మందుబాబులకే కాదు.. వారి భార్యలకు కూడా కోపం తెప్పించింది. సో.. ఈ మూడు హామీలు జనాలు మరిచిపోలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. జగన్‌కు ఈ మూడు హామీలు అంకుశాల్లా తగులుతూనే ఉంటాయన్నది విశ్లేషకుల మాట.