వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..?
విశాఖ ఏజెన్సీలోని పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ వైసిపికి కంచుకోట. ఈ ఎస్ టి రిజర్వ్‌డ్ స్థానంలో అభ్యర్థితో సంబంధం లేకుండా వైసిపి గెలుస్తూ వస్తోంది
విశాఖ ఏజెన్సీలోని పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ వైసిపికి కంచుకోట. ఈ ఎస్ టి రిజర్వ్‌డ్ స్థానంలో అభ్యర్థితో సంబంధం లేకుండా వైసిపి గెలుస్తూ వస్తోంది. అందుకే 2014 - 2019 - 2023 ఎన్నికల్లో వైసిపి వరుస విజయాలు సాధించింది. గత ఎన్నికల్లో అయితే రాష్ట్ర మొత్తం కూటమీ ప్రభంజనం వీచినా ఇక్కడ మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మత్స్యరాస విశ్వేశ్వర రాజు .. టిడిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై గెలిచారు. ఆ తర్వాత నుంచి లోకల్ వైసిపి లో విభేదాలు ముదిరిపోయాయి. పార్టీకి నియోజకవర్గంలో ఆదరణ బాగున్నా.. నాయకులు మధ్య గొడవలు పార్టీ గ్రాఫ్ దిగజారిపోతోంది. ఇటీవల సంస్థాగత మార్పుల్లో భాగంగా ఎమ్మెల్యేకు అల్లూరు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది పార్టీ హై కమాండ్. మరో నేత మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీం సభ్యురాలుగా ప్రకటించింది.
ఆ తర్వాత మారుతున్న పరిస్థితులలో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వర రాజు అసెంబ్లీలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ప్రత్యర్థి వర్గం మాత్రం ఎమ్మెల్యే ఏం చేయటం లేదు అంటూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ఉందట. ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టేందుకు సొంత పార్టీకి చెందిన కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న చర్చలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. మరోవైపు విశ్వేశ్వర రాజు పై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి న్యాయపోరాటం చేస్తున్నారు.. ఎన్నికల అప్పుడు వీటిలో ఉద్దేశపూర్వకంగా నిజాలు దాచేసారని.. ఆయన మీద అనర్హత వేటువేయాలని ఆమె కోర్టుకు వెళ్లారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎస్టీ కమిషన్ మెంబర్‌గా లాభదాయక పదవి అనుభవించిన ఆయన అప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతభత్యాలు పొందుపరచడం లేదని ఈశ్వరి ఆరోపిస్తున్నారు. అటు టిడిపి వాళ్ల నుంచి టార్గెట్ అవుతూ ఉండటం.. ఇటు సొంత పార్టీలో అంతర్గత రాజకీయాలతో విశ్వేశ్వర రాజు విలవిల్లాడుతున్న పరిస్థితి. వీరిద్దరి మధ్య గొడవ నేపథ్యంలో జగన్ ఇటీవల వీరిని తాడేపల్లికి పిలిపించి కలిసి పనిచేయకపోతే సహించబోమని వార్నింగ్ ఇచ్చినా కూడా మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఎక్కడా వెనక్కు తగ్గకుండా విశ్వేశ్వర రాజును ఢీకొడుతున్నారట. ఇదిలా ఉంటే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పక్కచూపులు చూస్తున్నట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కటం లేదని.. ఆయన ఆవేదన ఆయన కూడా పార్టీ మారితే పాడేరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు.