వైసీపీలో కీలక పదవులు...వారికే జగన్ పెద్ద పీట !

జగన్ పార్టీ వారితో చెబుతున్నట్లుగా అయిదేళ్ళు ఇట్టే గడచిపోతాయో లేదో తెలియదు కానీ వైసీపీ ఇనాక్టివ్ గా ఉంటూ మాత్రం మూడు నెలలు గడచిపోయాయి

Update: 2024-09-05 17:59 GMT

ఎన్నికల్లో ఘోర ఓటమి చెంది మూడు నెలలు ఇట్టే గడచిపోయాయి. జగన్ పార్టీ వారితో చెబుతున్నట్లుగా అయిదేళ్ళు ఇట్టే గడచిపోతాయో లేదో తెలియదు కానీ వైసీపీ ఇనాక్టివ్ గా ఉంటూ మాత్రం మూడు నెలలు గడచిపోయాయి. దాంతో జగన్ కూడా ఇక టైం వేస్ట్ చేయదలచుకోలేదు.

ఏపీలో టీడీపీ కూటమి బలంగా ఉంది. దాంతో ఆయన వరుసగా పార్టీ పదవులు భర్తీ చేస్తున్నారు. అలాగే జిల్లాల అధ్యక్షుల నియామకాలు చేపడుతున్నారు. ఈ విషయంలో ఆయన అన్ని లెక్కలూ వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైసీపీలో జిల్లా అధ్యక్షులకు జగన్ చూసే అర్హతలు కొన్ని ఉన్నాయని అంటున్నారు.

ధాటిగా టీడీపీ కూటమిని ఎదుర్కోవడం, అదే విధంగా ఆర్థికంగా బలంగా ఉండటం. అలా ఉంటేనే విపక్షంలో ఉన్న పార్టీ దైనందిన కార్యక్రమాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఆయన పట్టం కట్టారు. అదే విధంగా నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ గా మరో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డిని నియమించారు.

దీని కంటే కొద్ది రోజుల ముందు అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే అంతత వెంకట్రామిరెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. ఈ విధంగా రాయలసీమ నుంచి జగన్ ముందు చేసుకుంటూ వస్తున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలన్న ఉద్దేశ్యంతో రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల విషయంలోనే సీరియస్ గా చూస్తునారు అని అంటున్నారు.

ఇక కోస్తాలో బలపడేందుకు వైసీపీ గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే సామాజిక సమీకరణలు ఇటీవల ఎన్నికల్లో బెడిసి కొట్టినందువల్ల జగన్ ఈసారి నియామకాలలో ఏ విధంగా ఎంపికలు చేస్తారు అన్నది చూస్తున్నారు. గోదావరి జిల్లాలో బలంగా ఉన్న కాపులు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంది.

ఉత్తరాంధ్ర వరకూ వైసీపీకి జగన్ కి ఒక క్లారిటీ ఉంది. బీసీ నాయకత్వాలను అక్కడ ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్రా పార్టీ బాధ్యతలను కూడా కట్టబెడతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ కూటమితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించాల్సిన తరుణం ఇది. అంతే కాదు పార్టీ పరంగా మీడియా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు విధానాలను చెప్పాల్సిన పరిస్థితి ఉంది.

పార్టీ ఓటమి చెంది ఇబ్బందులో ఉంది. దాంతో ఖర్చులు కూడా బాగా అవుతాయి. ఆ విధంగా దేనికీ వెరవని వారే జిల్లా పగ్గాలు అందుకుంటే రానున్న కాలంలో పార్టీ బలపడుతుంది అని జగన్ ఆలోచిస్తున్నారు. 2025లో జరిగే స్థానిక ఎన్నికల నాటికి వైసీపీని పటిష్టం చేసుకుంటే ఆ ఎన్నికల్లో కూటమిని ఢీ కొట్టవచ్చు అన్నది జగన్ ఎత్తుగడగా కనిపిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News