జగన్ వరద టూర్...రాజకీయ బురదగా మారుతోందా ?

మాజీ సీఎం వైఎస్ జగన్ బెజవాడలో వరద ప్రాంతాలలో పర్యటించారు. అది నిజంగా మెచ్చతగిన చర్యగానే అంతా భావించారు.

Update: 2024-09-03 22:30 GMT

మాజీ సీఎం వైఎస్ జగన్ బెజవాడలో వరద ప్రాంతాలలో పర్యటించారు. అది నిజంగా మెచ్చతగిన చర్యగానే అంతా భావించారు. ఎందుకంటే కనీ వినీ ఎరగని వరదలు వచ్చిపడ్డాయి. దాంతో విజయవాడ జల ప్రళయాన్నే చూసింది. ఈ తరం అటువంటి ఉపద్రవాన్ని చూసి ఎరగదు, అందువల్ల జనాలు బెంబేలెత్తారు. సన్నద్ధత విషయంలో అధికార యంత్రాంగం కూడా కొంత తడబడిన విషయం వాస్తవం.

అయితే జగన్ చేసిన ఈ వరద టూర్ కాస్తా రాజకీయ బురదగా మారుతోంది అని అంటున్నారు. జగన్ మాజీ సీఎం హోదాలో ఈ టూర్ లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత వరకూ ఓకే కానీ అదే సమయంలో ప్రభుత్వం మీద చేసిన విమర్శలే ఇపుడు రాజకీయ రచ్చకు కారణం అవుతున్నాయి. ఇది మానవ తప్పిదం అన్నారు, ఈ వరదలకు కారణం ప్రభుత్వ వైఫల్యం అన్నారు.

ఆయన విపక్ష నేతగా ఇలాంటి మాటలు అనవచ్చు. కానీ సందర్భం అది కాదని అంటున్నారు. సర్వం కోల్పోయి బాధితులు ఉన్నారు. లక్షలాది మంది తలరాతను మార్చిన వరదలు ఇవి. ఎవరూ ఊహించని విధంగా వచ్చిపడింది. దాంతో ప్రభుత్వం తేరుకోని సహాయ చర్యలను చేపడుతోంది.

ఈ పరిస్థితుల్లో తప్పులు ఉంటాయి. పొరపాట్లు ఉంటాయి. వాటిని వేరే సమయంలో లేవనెత్తితే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత సాయం చేసినా లక్షలాది మందిని ఓవర్ నైట్ అందేది కాదు, ఇక వరదలు ఎవరి తప్పిదం, ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం ఎంతవరకూ సీరియస్ గా తీసుకుంది అన్నది ఆ తరువాత మాట్లాడాల్సిన సబ్జెక్ట్.

కానీ జగన్ చేసిన ఈ విమర్శలతో ఆయనకు ఏమీ పొలిటికల్ గా కలసి వచ్చింది లేదు సరికదా మరింత బురద అంటించుకున్నట్లు అయింది. చంద్రబాబు సహా మంత్రులు అంతా జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బుడమేరు వరదలకు జగన్ అయిదేళ్ల పాలన కారణం అంటున్నారు. అవును రాజకీయాల్లో ఎవరూ తప్పులను తీసుకోరు. ఒకటి అంటే పది అంటారు. అంతే కాదు చంద్రబాబు మరికాస్తా ముందుకు వెళ్ళి ప్రకాశం బ్యారేజి గేట్లను ధ్వంసం చేసే ప్రణాళికలో భాగంగానే ఆ నాటు పడవలను వదిలారా లేక, ఆ పడవలు ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకువచ్చాయా అనే అంశంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.

దాంతో వైసీపీని టీడీపీ చాలా తెలివిగా కార్నర్ చేసినట్లు అయింది. అంతే కాదు కొన్ని చోట్ల వాగులు వంకలకు గండి కొట్టే దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవడానికి పోలీస్ పెట్రోలింగ్ పెట్టామని కూడా బాబు చెప్పారు. ఒక క్రిమినల్ పార్టీ ఏపీలో ఉందని అంటూ ఆయన వైసీపీ మీద ఘాటు విమర్శలు చేశారు

అసలు ఇదంతా అవసరమా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు, ఇక వరదలు అన్నవి ప్రకృతి విపత్తు, ఎవరు కూడా ప్రకృతిని ఎదిరించి ఏమీ చేసేది ఉండదు, విజయవాడలో వరదలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి అంటే అక్రమ నిర్మాణాలకు కారణం తీసుకుంటే ఆ లిస్ట్ లోకి అందరూ వస్తారు. దాంతో ఆ టాపిక్ ని కాస్తా పక్కన పెట్టి సహాయం చేసేందుకు అంతా చూడాలి.

ఇదిలా ఉంటే జగన్ పార్టీ నేతలతో సమావేశం అయి కోటి రూపాయలు తన వంతుగా విరాళం ప్రకటించారు. ఇది బాగుంది. దీనితో పాటు వైసీపీ నేతలు విరాళాలు ఇచ్చి తమ వంతుగా బాధితులను ఈ కష్టకాలంలో ఆదుకుంటే బాధితులకు స్వాంతన చేకూరుతుంది. ఇక అధికార పక్షం కూడా విమర్శలకు తావు ఇవ్వకుండా పని చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దల మీదనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. దాంతో ఒకరిని ఒకరు అనుకుంటూ రాజకీయ బురదను అంటించుకోవడం వల్ల వచ్చేది ఏమీ ఉండదు. బెజవాడను ఎలా ఈ నీటి గండం నుంచి బయటపడేయాలి అన్న దాని మీదనే అంతా ఫోకస్ పెడితే బాగుంటుంది.

Tags:    

Similar News