జగన్ బీసీ మంత్రం వదిలేయాలా.. ఆ వైసీపీ లీడర్ మాటల వెనక..?
బీసీలు.. అంటే అప్పుడు.. ఇప్పుడు.. కూడా టీడీపీకి వెన్నుదన్ను. ఈ విషయంలో తేడా లేదు.
బీసీలు.. అంటే అప్పుడు.. ఇప్పుడు.. కూడా టీడీపీకి వెన్నుదన్ను. ఈ విషయంలో తేడా లేదు. అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా బీసీలు ఆ పార్టీని గెలిపిస్తున్నారు. ఒక్కొక్కసారి రాష్ట్రంలో తీవ్ర మైన పోటీ నెలకొన్నప్పుడు కూడా..టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు అండగానే ఉంటూ వచ్చింది. అయితే.. ఈ ఓటు బ్యాంకును తమ సొంతం చేసుకోవాలని.. గతంలో ఎవరూ పెద్దగా ప్రయత్నం చేయలేదు. టీడీపీని దెబ్బకొట్టాలని అనుకున్నా.. ఓటు బ్యాంకు వైపు మొగ్గు చూపలేదు.
అంటే.. బీసీ ఓటు బ్యాంకును దూరం చేసి.. టీడీపీని బలంగా దెబ్బకొట్టే వ్యూహాన్ని ఆనాడు రాజశేఖరరెడ్డి చేయలేదు. ఆ తర్వాత.. వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా చేయలేదు. కానీ, గత ఐదేళ్లలో వైసీపీ అధినేత జగన్ బలంగా ప్రయత్నించారు. 2019 ఎన్నికలకు ముందు కంటే కూడా.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు సలహా ఇచ్చారో కానీ.. బీసీ మంత్రాన్ని పఠించారు. మంత్రి వర్గ కూర్పు నుంచి సామాజిక వర్గాల కార్పొరేషన్ల వరకు కూడా.. జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
మెజారిటీ పదవులను బీసీలకు ఇస్తూ వచ్చారు. బీసీ కార్పొరేషన్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనరల్ స్థానాలను కూడా బీసీలకు ఇచ్చేశారు. ఇక, బీసీ మహిళలకు ఎమ్మెల్సీగా.. చైర్‌పర్సన్‌లుగా కూడా ఎక్కువ అవకాశాలు కల్పించారు. ఇలా.. జగన్ తనదైన శైలిలో బీసీలను తనవైపు ఆకర్షిం చేందుకు ప్రయత్నించారు. ఒకరకంగా చెప్పాలంటే.. బీసీలంతా తమకు వెన్నెముక అని చెప్పుకొనే టీడీపీ కూడా ఇవ్వనన్ని పదవులు ఇచ్చారు.
ఇదే విషయాన్ని ఈ ఏడాది ఎన్నికల్లో జగన్ ప్రచారం చేసుకున్నారు. కానీ, బీసీలు ఆయన వెంట నడవలేదు. జగన్ ను వాళ్లు నమ్మినట్టుగా లేదు. అందుకే ఇలా జరిగిందని వైసీపీ నాయకులు తేల్చేశారు. చివరకు ఎంతో నమ్ముకున్న బీసీ నాయకులు కూడా జగన్‌కు దూరమయ్యారు. అవుతున్నారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఎవరి పార్టీకి అండగా ఉన్న ఆయా సామాజిక వర్గాలను ఆయా పార్టీలు కాపాడుకుంటే బెటర్! అంటూ.. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగన్ ఆలోచనలో పడ్డారు. అందుకే! దీనిని బట్టి ఇకపై అయినా.. ఆయన తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు.