జగన్.. 'పిఠాపురం' టూర్ సక్సెస్.. మైలేజీ వచ్చిందా ..!
సో.. టూర్ సక్సెస్ అయితే అయింది.. కానీ, అనుకున్న మైలేజీ వచ్చిందా? అనేది ఇప్పుడు వైసీపీ నేతల ప్రశ్న.
వైసీపీ అధినేత జగన్.. ప్రజల మధ్యకు రావడం ప్రారంభించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ఆయన వరద బాధితులను పరామర్శించేందుకు జనం బాట పట్టారు. ఈ క్రమంలో విజయవాడలో రెండు సార్లు పర్యటించారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. ఇక్కడ కూడా ఏలేరు రిజర్వాయర్ కారణంగా వరద ప్రభావానికి గురైన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వీరిని పరామర్శించేందుకు జగన్ తన పరివారంతో ముందుకు కదిలారు. కొంత దూరం కారులోనే వెళ్లారు. ఆ తర్వాత.. ఇలా చేస్తే.. బాగుండదని కొందరు ఇచ్చిన సలహాతో ఆయన నేరుగా వరద నీటిలో దిగి.. రమణక్కపేటలో బాధితులను ఓదార్చారు. అక్కడే మీడియాతోనూ మాట్లాడారు. మొత్తానికి తన పంథాలో సర్కారుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తన పాలనలో ఏం చేశారో చెప్పుకొచ్చారు. సరిగ్గా.. ఈ టూర్ సక్సెస్ అయింది.. అని అనిపించుకునేలా వ్యవహరించారు.
సో.. టూర్ సక్సెస్ అయితే అయింది.. కానీ, అనుకున్న మైలేజీ వచ్చిందా? అనేది ఇప్పుడు వైసీపీ నేతల ప్రశ్న. దీంతో అనేక మంది కీలక నాయకులు దీనికి సంబంధించిన వీడియోలను రివైండ్ చేసుకుని మరీ చూస్తున్నారు. తమ పార్టీ అధినేత చేపట్టిన టూర్ ఏమేరకు సక్సెస్ అయిందో చూసుకుంటున్నారు. అయితే.. జగన్ టూర్‌లో ప్రజల నుంచి స్పందన వచ్చింది కానీ.. తమకు సాయం చేయాలని అడిగిన వారే ఎక్కువగా ఉన్నారు. జగన్ వస్తున్నాడంటే.. తమకు ఏదో ఒకటి తెస్తున్నాడని వారు ఆశించారు.
ఇది సహజంగా జరిగే ప్రక్రియే ఎవరైనా సరే.. బాధల్లో ఉంటే.. తమకు ఏదో ఒక సాయం అందక పోతుందా? అని అనుకుంటారు. కానీ, జగన్ నుంచి ఎలాంటి సాయం అందలేదు. ప్రకటన కూడా చేయలేదు. విజయవాడలో అయినా..తాము కోటి రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు కానీ.. పిఠాపురంలో మాత్రంఉత్తచేతులతో వెళ్లి.. ఉత్త చేతులతోనే తిరిగి వచ్చారు. దీంతో స్థానికుల నుంచి పెదవివిరుపులు కనిపించాయి. దీంతో టూర్ సక్సెస్.. మైలేజీ ఢమాల్ అనే వాదన వినిపిస్తోంది. అసలు వెళ్లకపోయినా బాగుండేదని వెళ్లి.. ఏమీ చేయకపోవడంతో మైనస్ అయ్యామని కొందరు నాయకులు చెబుతున్నారు.