ముహూర్తం ఫిక్స్... జనాల్లోకి జగన్ - షర్మిళ!
ఈ ఉత్సాహన్ని కంటిన్యూ చేస్తూ.. ఈ ఊపుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కంటిన్యూ చేసే కార్యక్రమంలో భాగంగా షర్మిల ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఏపీలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. నిన్నమొన్నటి వరకూ ద్విముఖ పోరు అని చర్చ నడిచిన వేళ... త్రిముఖ పోరుకు తెరలేపుతూ ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె... ఇటు వైఎస్ జగన్ ను, అటు చంద్రబాబుని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ పదేళ్లూ వీరిద్దరూ రాష్ట్రాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదని.. రాజధాని లేని రాష్ట్రంగా మార్చారంటూ దుయ్యబట్టారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం బిగ్ టర్న్ తీసుకుంది.
ఈ ఉత్సాహన్ని కంటిన్యూ చేస్తూ.. ఈ ఊపుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కంటిన్యూ చేసే కార్యక్రమంలో భాగంగా షర్మిల ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న ఆమె ఇకపై బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో యాత్రతో పాటు మరికొన్ని కీలక బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు అప్పగించిందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... పార్టీ నుంచి వీడిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించటం, పార్టీ ఓటు బ్యాంకు పెంచటం, స్థబ్ధగా ఉన్న కేడర్ లో కదలికలు తీసుకురావడం వంటికి షర్మిల ముందున్న ప్రధాన కర్తవ్యాలని అంటున్నారు. అందులో భాగంగా ప్రధానంగా వైసీపీ, టీడీపీల్లో సీట్లు దక్కని నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. ఈ సమయంలోనే షర్మిల ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా ఈవారంలోనే... శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి షర్మిల జిల్లాల యాత్ర ప్రారంభించనున్నారని తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాదయాత్రకు సమయం సరిపోదు కాబట్టి... బస్సు యాత్ర ద్వారా ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు జిల్లాలన్నీ కవర్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో జిల్లాల వారీగా చేరికలపై ప్రధానంగా దృష్టి పెట్టారని సమాచారం.
కాగా... అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్న జగన్ ఈ నెల 25 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో తొలి సమావేశం జనవరి 25న విశాఖపట్నం, భీమిలిలో జరగనుంది. మిగిలిన 4 ప్రాంతాల తేదీలను త్వరలో తెలియజేయడం జరుగుతుంది.
ఈ సభలను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తుంది. వీటిలో ఒక్కో మీటింగ్ కి కనీసం 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున ఈ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ వారంలోనే అటు జగన్, ఇటు షర్మిళ జనాల్లోకి వెళ్లబోతున్నారన్నమాట! మరి అన్నా చెల్లి మధ్య రాజకీయం ఏస్థాయిలో ఉండబోతుందనేది వేచి చూడాలి.