జగన్ ప్రజాదర్బార్.. అధికారం పోయాక.. కీలక కార్యక్రమం!
ఈ నెల 15 నుంచి తాడేపల్లిలోని తన నివాసంలో జగన్.. ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తాజాగా ప్రకటించాయి.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు. కానీ, చిత్రం ఏంటంటే.. వైసీపీ అధినేత జగన్ మాత్రం అధికారంలో ఉండగా.. ప్రజలను పట్టించుకోలేక పోయారు. రాష్ట్రంలో విధ్వంసాలు జరుగుతు న్నాయని.. వైసీపీ నాయకులు దోపిడీ చేస్తున్నారని చెప్పినప్పుడు ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అంతా ప్రతిపక్షాల కుట్ర.. తన ప్రజా ప్రభుత్వంపై జరుగుతున్న దాడిగానే ఆయన అభివర్ణించారు. నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉన్నారు. కానీ.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత.. వైసీపీ ని ప్రజలు బుట్టదాఖలు చేసిన తర్వాత.. ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేపట్టారు.
ఈ నెల 15 నుంచి తాడేపల్లిలోని తన నివాసంలో జగన్.. ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తాజాగా ప్రకటించాయి. ఈ ప్రజాదర్బార్‌కు ప్రజలు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా సరే తమ సమస్యలతో రావచ్చని.. జగన్ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారని తెలపారు. వాస్తవానికి.. అధికారంలో ఉన్నప్పుడు.. ప్రజలకు జగన్ అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని.. వెళ్లారు.
ఎక్కడికి వెళ్లినా.. చెట్లు నరికేయించారు. నిజానికి ప్రధాని వస్తుంటేనే.. చెట్లు నరికే సంస్కృతి ఈ దేశంలో ఎప్పుడూలేదు. గతంలో సోనియా గాంధీ పర్యటనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరదాలు కట్టి తీసుకువెళ్లారు. దీనిపై అప్పట్లో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. కానీ, ఆయన తనయుడిగా.. రాజ్యపాలన చేస్తున్నానని చెప్పిన జగన్ మాత్రం ప్రజలకు చేరువ కాలేకపోయారు. పరదాలుకట్టుకుని తిరిగారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత.. ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోయాక.. ఆయనకు ప్రజలు గుర్తుకు వచ్చారు.
పోనీ.. ఇప్పుడైనా మంచిదే అనుకుందాం. కానీ, ఐదేళ్లు చేష్టలుడిగి చూసిన తర్వాత.. ఇప్పుడు ఏ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారో వైసీపీకే తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. అసలు సమస్యల్లో ఉన్నది వైసీపీనే. ఇప్పుడు నిజానికి జగన్ నిర్వహించాల్సింది.. వైసీపీ దర్బార్. తద్వారా నాయకులను లైన్‌లోపెట్టడం.. నోరేసుకుని పడిపోయివారిని కంట్రోల్ చేయడం. ఇది వదిలేసి.. ఇప్పుడు మళ్లీ ప్రజాదర్బార్ అంటూ.. ముందుకు వచ్చినా.. ఏమేరకు ప్రజలు ఆయనను సంప్రదిస్తారో చూడాలి.