గేర్ మార్చిన జగన్... అసెంబ్లీలోకి బ్యాక్ గేట్ ఎంట్రీ!

ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి లోపలికి ప్రవేశించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాసేపు ఉండి వెళ్లిపోయారు.

Update: 2024-06-21 14:11 GMT

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరిగింది. రెండో రోజైన శనివారం అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లను ఎంచుకునే ప్రక్రియ ఉంటుంది. ఈ సమయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

అవును... ఏపీలో శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాల తొలిరోజు... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితోనూ ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వారికి అభినందనలు తెలిపారు!

ఈ క్రమంలో ఇంతకాలం సీఎం హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్.. శుక్రవారం మాత్రం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి లోపలికి ప్రవేశించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాసేపు ఉండి వెళ్లిపోయారు.

వాస్తవానికి గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్... తాడేపల్లిలోని నివాసం ఉంచి సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వచ్చేవారు. అయితే.. ఈ రోజు మాత్రం జగన్ వేరే మార్గంలో వెనుక గేటు నుంచి అసెంబ్లీలోకి వచ్చారు. అయితే.. అమరావతి రైతులు నిరసన తెలుపుతారనే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

మరోపక్క... జగన్ కి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడంతో ఆయన కూడా సాదారణ ఎమ్మెల్యేగానే గేటు బయట కారు నిలిపి నడుచుకుంటూ అసెంబ్లీలోకి అడుగుపెట్టాల్సి ఉంది. అయితే... మాజీ సీఎంగా జగన్ కు గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... ఆయన నేరుగా కారులోనే అసెంబ్లీ లోపలకి అనుమతి ఇచ్చామని శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు!

Tags:    

Similar News