ఓటమి వేళ బయటకు వచ్చి మనసుల్ని గెలిచిన జగన్!
ఆ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను సమ్ థింగ్ స్పెషల్ అన్న విషయాన్ని చెప్పేశారు.
గెలుపు రుచిని ఎవరైనా అస్వాదిస్తారు. కానీ.. ఓటమి పరీక్షను తట్టుకోవటం అంత తేలికైన విషయంకాదు. అన్నింటికి మించి పరాజయం వేళలో పరాజితుడి వెంట ఉండేందుకు ఎవరూ ఇష్టపడరు. ఆ మాటకు వస్తే.. షాకింగ్ ఓటమి ఎదురైనప్పుడు.. దానికి కారణం ఏమిటన్న విషయాన్ని ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధోరణి రాజకీయపార్టీలకు.. రాజకీయ పార్టీ అధినేతలకు తక్కువగా ఉంటుంది. ఆ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను సమ్ థింగ్ స్పెషల్ అన్న విషయాన్ని చెప్పేశారు.
ఏపీలో జరిగిన ఎన్నికల పలితాల్లో వైసీపీ అత్యంత దారుణ పరిస్థితుల్ని ఎదుర్కోవటం తెలిసిందే. కలలో కూడా ఊహించలేనంతగా పరాజయం పాలైంది. ఆ మాటకు వస్తే.. తాము ఈ స్థాయిలో గెలుస్తామన్న నమ్మకం తెలుగుదేశం కూటమికి కూడా లేదు. అంతటి దారుణ పరాజయం వేళ.. బయటకు రావటం.. ప్రజల ముందుకు వచ్చి నిలవటం.. ఎన్నికల ఫలితాలపై స్పందించి మాట్లాడటం లాంటివి అంత తేలికైన అంశాలు కావు.
ఆర్నెల్ల క్రితం తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైన వేళ.. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ తాము ఎందుకు ఓడిపోయామన్న విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు బయటకు రాలేదు గులాబీ బాస్ కేసీఆర్. పదేళ్లు అధికారంలో ఉన్న ఆయన.. ఎన్నికల్లో ఓడినంతనే ఆయన కనిపించకుండా వెళ్లిపోయారు. కానీ.. జగన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఫలితాల వెలువడిన గంటల వ్యవధిలోనే మీడియా ముందుకు రావటంపై ఓటమి మీద స్పందించటంతో పాటు జగన్ వ్యవహరించిన వైఖరి హుందాగా ఉందని చెబుతున్నారు.
ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని.. ప్రతిపక్షంగా పోరాటం చేయటం తనకేమీ కొత్త కాదన్న జగన్.. ఢిల్లీలో సైతం శాసించే కూటమిగా అధికారపక్షాన్ని అభివర్ణించిన జగన్.. ‘‘ఎవరో మోసం చేశారు. మరెవరో అన్యాయం చేశారని అనొచ్చు. అయితే ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ప్రజల తీర్పును స్వీకరిస్తాం. వారి కోసం పోరాడతాం. ప్రభుత్వంలో వచ్చిన వారికి అభినందనలు. ఎంత చేసినా 40 శాతం ఓటు బ్యాంక్ ను తగ్గించలేకపోయారు. రాజకీయ జీవితంలో ఐదు సంవత్సరాలు తప్పించి నా జీవితం మొత్తం ప్రతిపక్షంలోనే గడిపాను. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాల్ని అనుభవించాను. ఇప్పుడు అంతకన్నా కష్టాలుపెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొంటాం. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు హుందాగా ఉన్నాయి.
అంతేకాదు అందరి మనసుల్ని దోచుకునేలా చేశాయి. వేదన కలిగించే దారుణ ఓటమి వేళలోనూ.. బాధ్యత కలిగిన రాజకీయ అధినేతగా వ్యవమరించిన జగన్ శైలి అందరిని ఆకట్టుకునేలా చేసింది. రాజకీయ చాణుక్యుడిగా పేరున్న కేసీఆర్ ప్రదర్శించని రాజకీయ పరిణితిని జగన్ ప్రదర్శించారన్న మాట వినిపిస్తోంది.