గుంతలు తీసిన సొంత నేతలు... జగన్ డెసిషన్ ఇదేనా?

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-11 11:30 GMT

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో 151 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఈదఫా 11 స్థానలకే పరిమితమైపోయింది. ఈ సమయంలో... పార్టీ ఓటమికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల రూపంలో ఎన్ని కారణాలు ఉన్నా... ఇంటర్నల్ గా కూడా చాలా కారణాలే ఉన్నాయని గ్రహించారని అంటున్నారు.

అవును... ఏపీలో వైసీపీ ఘోర పరాజయానికి ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకూ కారణం అనే సంగతిపై ఇప్పటికే జగన్ & కోకి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుందని అంటున్నారు. అయితే ఆ కారణాలే కాకుండా... ఇంటర్నల్ వెన్నుపోట్లు కూడా ఉన్నాయని, సొంత నేతలే గుంతలు తవ్వారని జగన్ బలంగా నమ్ముతున్నారని, ఈ మేరకు సమాచారం కూడా ఉందని అంటున్నారు. దీంతో జగన్ సీరియస్ గా డెసిషన్స్ తీసుకోబోతున్నారని అంటున్నారు.

వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని స్థానిలో అన్నట్లుగా సుమారు 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేదు! వీరిలో నలుగురైదుగురు మాత్రం ఫ్యాన్ కింద నుంచి పక్కకు జరిగి వారి దారి వారు చూసుకున్నారు. ఇంకొంతమంది మాత్రం జగన్ పై రివేంజ్ ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తమకు కూడా టిక్కెట్ ఇవ్వలేదనే ఆక్రోశంతోనో, ఆగ్రహంతోనో.. లేక, జగన్ కు షాక్ ఇవ్వాలనో తెలియదు కానీ వారిలో సుమారు 10 నుంచి 15 మంది వైసీపీ నేతలు... గత ఎన్నికల్లో ప్రత్యర్థులకు తెర వెనుక మద్దతు పలికారట. ఈ మేరకు జగన్ కు పక్కా సమాచారం అందిందని అంటున్నారు. దీంతో... ప్రస్తుతం ఈ విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో భాగంగా తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు టిక్కెట్ దక్కలేదని ఆక్రోశంతో.. సొంత పార్టీ నేతకు వ్యతిరేకంగా పనిచేశారని అంటున్నారు. దీంతో క్రమశిక్షణ కమిటీ సూచనల మేరకు అతడిని సస్పెండ్ చేశారు! అయితే... అది సిద్ధారెడ్డితోనే ఆగలేదని.. ఆగదని అని తెలుస్తోంది. ఈ లిస్ట్ పెద్దగానే ఉందని అంటున్నారు.

ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిలో వైసీపీలో చాలా కాలంగా ఉంటున్న నేతలతో పాటు.. పక్క పార్టీల నుంచి వైసీపీలో చేరిన నేతలు కూడా ఉన్నారని... ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తే ఎంపీ టిక్కెట్ ఇచ్చారని ఫీలవుతున్న నేతలు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఈ జాబితా కాస్త ఎక్కువగా ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. తమ అసెంబ్లీ స్థానాల్లో ఇంకో వ్యక్తి (సొంత పార్టీ వారైనా) గెలిస్తే పాతుకుపోతారనే ఆలోచనలో నుంచే ఈ వెన్నుపోటు వ్యవహారం జరిగిందని అంటున్నారు.

దీంతో... ఈ విషయాలను సీరియస్ గా తీసుకున్న జగన్... ఇక వారిని పిలిచి, బుజ్జగించి, సన్నాయి నొక్కుల్లు నొక్కి కాలయాపన చేసి, అపనమ్మకంగా కలిసి ప్రయాణం చేయడం కంటే.. ఒక్క దెబ్బతో సస్పెండ్ చేసేస్తే బెటర్ అనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. దీంతో... ఇప్పుడు గుంతలు తీసిన సొంత నేతల వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు! మరి ఈ జాబితా ఎంత పెద్దగా ఉందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News