పుల్లలు పెట్టుడెందుకు జగ్గన్నా?
చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి.. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగుదామని చెప్పారు.
ఏపీ, తెలంగాణల మద్య గత దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న విబజన సమస్యల పరిష్కారానికి ఇటీవల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు ఒక అడుగు ముందుకు వేసిన విషయం తెలిసిందే. ఇరువురు నాయకులు.. ప్రజా భవన్‌లో అధికారులతో కలిసి.. సమావేశం నిర్వహించారు. పారదర్శకంగానే సమస్యలను పరిష్కరించుకోవాలని తీర్మానించారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతోను, మంత్రులతోనూ కమిటీలు ఏర్పాటు చేసుకుని అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించుకుందామన్నారు. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి.. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగుదామని చెప్పారు.
దీనిలో తప్పు కానీ.. తప్పులు వెతకడానికి కానీ..ఎక్కడా అవకాశం లేదు. అసవరం కూడా లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు జగ్గారెడ్డి మాత్రం.. దీనిని కూడా వివాదంలోకి లాగేశారు. బీజేపీ పంపిస్తేనే చంద్రబాబు వచ్చారని.. చంద్రబాబు వచ్చి.. తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రెండు కళ్ల సిద్ధాంతాన్ని కూడా ఆయన తెరమీదకి తెచ్చారని.. పుల్లలు పెట్టే ప్రయత్నంలో దూసుకుపోయారు. ఏపీలో బీజేపీ ఆడిన రాజకీయ క్రీడను తెలంగాణలోనూ ఆడేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని జగ్గన్న చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బాబును కమలం పార్టీ పావుగా వాడుతోందన్నారు.
చంద్రబాబును అడ్డు పెట్టి.. విభజన సమస్యల పేరుతో తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చూస్తున్నారని మరో మాట విసిరారు. తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందన్నారు. అయితే.. దీనిని తాము సాగనివ్వబోమ న్నారు. అంతేకాదు.. వివిధ కేసుల్లో ఉన్నవారు బీజేపీలో చేరి, వారికి మద్దతు ఇస్తున్నారంటూ.. పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక, తెలంగాణకు చంద్రబాబు ప్రత్యేకంగా చేసింది ఏమీలేదని కుండబద్దలు కొట్టారు. ఐటీని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. దీనికి బాబు కొనసాగించారంతే! అంటూ.. తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
అయితే.. జగ్గన్న చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతవరణం ఏర్పడుతోందని.. దీనిని ఎందుకు నాశనం చేస్తున్నారని.. జగ్గన్నపై విమర్శలు వస్తున్నాయి. విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించేందుకు పడుతున్న అడుగులను ఆపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చేతనైతే.. సీనియర్ నాయకుడిగా సలహాలు ఇవ్వొచ్చని.. కానీ.. ఇలా ముందుకు పడుతున్న అడుగులకు అడ్డు పెట్టి.. ఆపాలని చూడడం, దీనికి కూడా రాజకీయంగా మరకలు అంటించడం సమంజసమేనా? అని ప్రశ్నిస్తున్నారు.