ఢిల్లీ ధర్నా.. జగన్ ఇచ్చిన సందేశం ఇదేనా?
జగన్ ఇప్పటికిప్పుడు ఢిల్లీలో ధర్నా చేయడం అంటే.. దీని వెనుక ఎలాంటి వ్యూహం లేకుండా ఆయన అడుగులు వేసే ప్రయత్నం చేయరు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా.. ఎలాంటి సందేశం ఇచ్చారు? ఎవరికి సందేశం ఇచ్చారు? ఇది చాలా వ్యూహాత్మకంగా వేసిన అడుగుగానే భావించాల్సి వుంది. ఎందుకంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతల లోపానికి సంబంధించి.. జగన్ ఇప్పటికిప్పుడు ఢిల్లీలో ధర్నా చేయడం అంటే.. దీని వెనుక ఎలాంటి వ్యూహం లేకుండా ఆయన అడుగులు వేసే ప్రయత్నం చేయరు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
జగన్ ఉద్దేశం ప్రకారం.. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారుకు ఇచ్చే సందేశం కంటే కూడా.. కేంద్రంలోని మోడీకి ఆయన ఏదో గొప్ప సందేశమే ఇచ్చినట్టు తెలుస్తోంది. తను ఒంటివాడిని కాదని.. తనకు అవకాశాలు అపారంగా ఉన్నాయనే ఉద్దేశాన్ని ఆయన స్పష్టంగా చెబుతున్నట్టు భావించాల్సి ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో నలుగురు ఎంపీలను మాత్రమే గెలిచినా.. ఆయనకు బలం లేదని భావించాల్సి న అవసరం లేదన్న వాదనను తెరమీదికి తెచ్చినట్టు తెలుస్తోంది.
దీనికి బలం చేకూరుస్తున్న రెండు కీలక విషయాలు ఉన్నాయి. 1) మోడీ వ్యతిరేక పార్టీలతో జగన్ కలివిడి అడుగులు వేయడం. వారినే ఈ ధర్నాకు ఆహ్వానించడం. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీ లు ఉన్న నేపథ్యానికి తోడు లోక్‌సభ లోనూ నలుగురు ఎంపీలు ఉన్నారు. తద్వారా.. ఇండియా కూటమి పార్టీలను తన ధర్నాకు ఆహ్వానించడం ద్వారా.. మోడీని డిఫెన్స్‌లో పడేస్తున్నారన్న వాదన ఒకటి తెరమీదికి వచ్చింది.
2) తనను తక్కువగా అంచనా వేయొద్దన్న వ్యూహం. సాధారణంగా లోక్‌సభలో బలం లేనందున.. పైగా ఏపీలో కూటమి సర్కారు ఉన్నందున జగన్‌కు బలం తక్కువగా ఉందనేది రాజకీయంగా చర్చకు వస్తున్న విషయం. ఈ విషయంలో తన అస్థిత్వాన్ని.. వైసీపీ పార్టీ పని అయిపోలేదన్న వాదనను వాదనను ఆయన చెబుతున్నారు. ఢిల్లీ ధర్నా ఉద్దేశం ఎలా ఉన్నా.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ.. తాను జాతీయ స్తాయిలో నాయకులను పార్టీలను కదిలించగలిగే స్తాయిలో ఉన్నానని చెప్పుకోవడం ద్వారా.. మోడీ ప్రభుత్వానికి తన అవసరాన్ని చెప్పకనే చెబుతున్నారా? అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి ఈ సంకేతాలను మోడీ ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి.