ఇప్పుడు బాధపడి లాభం ఏంటి జగనన్న..?

కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సారి కూడా మీడియా ముందుకు రాకుండా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా వ్యవహరించి మైనస్ అయ్యారు.

Update: 2024-07-28 15:30 GMT

అధికారంలో ఉన్నప్పుడే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను ప్రజలకు వివరించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు కదా! ఇదీ.. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ గురించి వినిపిస్తున్న టాక్‌. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సారి కూడా మీడియా ముందుకు రాకుండా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా వ్యవహరించి మైనస్ అయ్యారు. పైగా అప్పుల విషయంలోనూ ఆర్థిక వ్యవస్థ విషయంలోనూ శాంతిభద్రతల విషయంలోనూ ఇసుక మైనింగ్ ఇతర అంశాల్లోనూ తీవ్ర స్థాయిలో వ‌చ్చిన‌ ఆరోపణలు, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన దాడి, అదే సమయంలో ఓ వర్గం మీడియా ప్ర‌చురించిన అనేక విషయాలను ప్రజలు గమనించారు.

దీనిని తప్పుపట్టాల్సిన అవసరం. అధికార పార్టీని టార్గెట్ చేయడం అధికార పార్టీ తప్పులను ఎత్తిచూప టం అధికార పార్టీని సాధ్యమైనంత వరకు ప్రజలకు దూరం చేయటం అనే కాన్సెప్ట్ తో ప్ర‌తిప‌క్షం ముం దుకు సాగుతుంది. రేపు వైసిపి అయినా ఇదే పని చేస్తుంది. కాబట్టి దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఏదైనా జరిగినప్పుడు వెంటనే కౌంటర్ ఇవ్వటం అనేది అధికార పక్షానికి ఉన్న అవసరం. గతంలో చంద్రబాబు కూడా గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ఘటనకు వెంటనే కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో 37 మంది చనిపోయారని, చంద్రబాబు షూటింగ్ కారణంగానే ఇలా జరిగిందని వైసీపీ నాయకులు విమర్శలు చేశారు.

ఆ స‌మ‌యంలో టిడిపి నాయకులు వెంటనే స్పందించారు. అలాగే విజయవాడలో నకిలీ మద్యం తాగి ఏడుగురు రిక్షా కార్మికులు చనిపోయినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ వెంటనే చంద్రబాబు స్పందించారు. ఈ విషయంలో ఎక్కడా ఆయన రోజుల తరబడి సమయం తీసుకోలేదు. రెండు మూడు గంటల్లోనే స్పందించి ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి పరిణామం వైసీపీలో ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు జగన్ స్పందిస్తారని ఆశించారు.

విజయనగరం జిల్లాలో రాముడి తల తీసేశారన్న విషయం.. వెలుగు చూసినప్పుడు ప్రభుత్వం స్పంది స్తుందని, ముఖ్యమంత్రి జ‌గ‌న్ బయటకి వస్తారని ఎదురు చూశారు. అప్పుడు కూడా రాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో మరింతగా వైసిపి డ్యామేజ్ అయింది. ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలోనూ అలాగే డాక్టర్ సుధాక‌ర్‌ విషయంలోనూ.. అదే విధంగా తాడేపల్లిలో జరిగిన ఒక యువతి దారుణం విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని, దానికి వివరణ ఇస్తారని వైసీపీ నాయకులే కాదు వైసిపి సానుభూతిపరులు కూడా ఎదురు చూశారు.

కానీ ఏ రోజు ఏ విషయం పైన జగన్ మైకు పట్టుకున్నది లేదు. వివరణ ఇచ్చింది లేదు. దీంతో ప్రతిపక్షాలు చెప్పిందే నిజమని ప్రజలు అనుకున్నారు. ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తిని ఎవరైనా దొంగ అంటే వెంటనే రియాక్ట్ అవుతాడు. నేను దొంగతనం చేయలేదు, నాకు సంబంధం లేదు అని తనంత తాను డిఫెన్స్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అలాంటిది ఐదు కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం తనపై ఇన్ని ఆరోపణలు వచ్చినా స్పందించకపోవడం కనీసం ఏ ఒక్కరోజు మీడియా ముందుకు రాకపోవడం. వచ్చినా సరైన వివరణ, సరైన వాయిస్ వినిపించలేని కారణంతో విపక్షాల మాటే చెల్లుబాటయింది.

ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా చివరకు చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్వేత పత్రాల ద్వారా జగన్మోహన్ రెడ్డి పాలల్లో భారీ స్థాయిలో అప్పులు జరగలేదని స్పష్టమైన మద్యం వినియోగం తగ్గించి మేలు చేశారు అని మేధావులు సైతం భావిస్తున్నా ఇప్పుడైతే చేతులు కాలిపోయాయి. ఇప్పుడైతే అధికారం రాదు కదా ఇప్పుడైతే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో తెలియదు కదా. కాబట్టి ఏదైనా ప్రజలకు పార్టీ అధినేతకు మధ్య ఉండాల్సిన బలమైన బంధాన్ని, మీడియాకు పార్టీ అధినేతకు మధ్య ఉండాల్సిన ఒక సానుకూల దృక్పథాన్ని.. జగన్ పాటించ‌ని కారణంగా ప్రతిపక్షాల ప్రచారమే నిజమని ప్రజలు నమ్ముకోవడంలో తప్పేమీ లేదు.

ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి కనీస వారానికి రెండుసార్లు నెలకి మూడుసార్లు అయినా మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగాలి అని ఈ మూడు విషయాలపై జగన్మోహన్ రెడ్డి వివరణ ఇస్తే ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నా పద్ధతి నాదే నేను బయటికి రాను సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తులు మాత్రమే మీడియా ముందుకు వస్తారు అంటే జ‌రిగే నష్టం ఏమిటో ఈ ఎన్నికలు చెప్పేశాయి. మునుముందు జాగ్రత్త పడాలంటే ఇప్పటికే నా జగన్ కళ్ళు తెరవాలి.

Tags:    

Similar News