సాయిరెడ్డికి జగన్ బిగ్ టాస్క్.. విజయవంతమయ్యేనా?
ఈ క్రమంలో నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలను గెలవాలని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
ఈ క్రమంలో నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. విజయసాయిరెడ్డి ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాలేదు. వైఎస్సార్ కుటుంబ ఆడిటర్ గా వెలుగులోకి వచ్చిన ఆయన అక్రమాస్తుల కేసులో జగన్ తోపాటు జైలుశిక్షను అనుభవించారు. ప్రస్తుతం జగన్ తోపాటే ఆయన కూడా బెయిల్ పై ఉన్నారు.
వైసీపీ తరఫున మొదటి రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డినే జగన్ ఎంపిక చేసుకోవడం విశేషం. ప్రస్తుతం రెండోసారి వరుసగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డి పదవీకాలం 2028 జూన్ 28 వరకు ఉంది. అంటే దాదాపు నాలుగేళ్ల కాలం మిగిలి ఉంది. అయినప్పటికీ ఆయనను జగన్ నెల్లూరు ఎంపీగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని దించడానికి జగన్ నిర్ణయించారు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కూడా ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం తాజాగా పూర్తయింది. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిని ఖరారు చేశారు. అయితే నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కొంతమంది అభ్యర్థులను మార్చాలని, తాను చెప్పినవారికి సీట్లు ఇవ్వాలని వేమిరెడ్డి కోరారు. అలాగే నెల్లూరు సిటీ నుంచి తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి సీటు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు జగన్ అంగీకరించకపోవడంతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారని సమాచారం. టీడీపీ తరఫున నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు.
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఆర్థికంగా చాలా బలవంతులు. వైసీపీకి ఆర్థిక వనరులను అందించే మూలస్తంభాల్లో ఒకరిగా ఆయనను చెబుతారు. అందుకు తగ్గట్టే వైసీపీ కూడా వేమిరెడ్డికి మొదట్లో చాలా ప్రాధాన్యత ఇచ్చింది. కొన్ని జిల్లాలకు పార్టీ తరఫున రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించింది. అంతేకాకుండా ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిని కూడా చేసింది.
మరోవైపు విజయసాయిరెడ్డిది కూడా నెల్లూరు జిల్లానే. వైసీపీ ఆవిర్భవించిన కొత్తల్లో నెల్లూరు జిల్లా వైసీపీ వ్యవహారాలను విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు. ఆ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు అనుచరవర్గం ఉంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నేతలతో సన్నిహిత పరిచయాలున్నాయి.
ఇప్పుడు టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పోటీ చేస్తుండటం, ఆయన ఆర్థికంగా బలవంతుడు కావడం, మరోవైపు ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రాంనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి) పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీ కొంత బలహీనపడిందనే అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా దించితే పార్టీ మళ్లీ బలం పుంజుకోవడంతోపాటు పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి బిగ్
షాట్ ను ఎదుర్కోవడానికి విజయసాయిరెడ్డి అయితేనే కరెక్ట్ అని భావించి ఆయనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని అంటున్నారు.
2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాలను, ఒక ఎంపీ స్థానాన్ని వైసీపీనే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సైతం ఇవే ఫలితాలను రిపీట్ చేయాలని జగన్ ఆశిస్తున్నారు. విజయసాయిరెడ్డిపై ఇప్పుడు పెద్ద టాస్క్ నే పెట్టారని అంటున్నారు.