కార్యకర్తకు వందనం...ఇంతలో ఇంత మార్పా ?

కార్యకర్త అంటే ఎవరు అన్న దానికి ఒక్కటే సమాధానం. ఆయన పార్టీకి జీవగర్ర. పార్టీకి ప్రాణ రూపం.

Update: 2024-07-08 03:30 GMT

కార్యకర్త అంటే ఎవరు అన్న దానికి ఒక్కటే సమాధానం. ఆయన పార్టీకి జీవగర్ర. పార్టీకి ప్రాణ రూపం. భౌతికంగా కనిపించే ఒక ముఖ్య లక్షణం. నాయకులు లేకపోతే పార్టీని నడపవచ్చు కానీ కార్యకర్తలు లేకపోతే పార్టీని ఒక్క క్షణం కూడా నడపలేరు.

పార్టీని నిరంతరం జీవ నదిగా ఉంచుతూ జన జీవన స్రవంతిలో కదులుతూ సాగే వారే కార్యకర్తలు. ఏ పార్టీకైనా ధీమా ఏంటి అంటే నాయకులు పార్టీని వదిలేసినా క్యాడర్ ఉండడమే. నాయకులు అన్న వారు గెలుపు ఓటములను చూసుకుంటారు. వారు అధికారం వైపుగానే ఎపుడూ అడుగులు వేస్తారు.

కానీ పార్టీని దాని నాయకుడిని నమ్మి అభిమానించే కార్యకర్తలు మాత్రం పార్టీ మారడం అన్నది రాజకీయ చరిత్రలో ఎక్కడా లేదు. వారికి పార్టీ పోకడల మీద కోపం ఉంటే మౌనంగా ఉంటారు తప్ప పార్టీకి ద్రోహం చేయరు. పని చేయడం మానేస్తారు. ఇలా చేయడం వల్లనే వైసీపీ 2024లో ఓటమి పాలు అయింది. నా పార్టీ అనుకోబట్టే 2019లో గెలిచింది.

ఈ రెండింటికీ మధ్య తేడాను గురించడంతో ఇపుడు వైసీపీ అధినాయకత్వం నిమగ్నం అయి ఉందని అంటున్నారు. భారీ ఓటమి ఒక విధంగా వైసీపీకి మేలు చేసేదిగా ఉందని అంటున్నారు. పార్టీ కోసం పనిచేసే క్యాడర్ ని దగ్గరకు తీయాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు.

ఆయన వారి కోసం సంచలన నిర్ణయాలే తీసుకోబోతున్నారు అని అంటున్నారు. వారి కోసం భీమా పథకాన్ని అమలు చేయబోతున్నారు అని అంటున్నారు. ఏదైనా ప్రమాదంలో గాయపడినా లేక మరణించినా ఆ భీమా వారికి అండగా ఉండేలా చర్యలు తీసుకుంటారని అంటున్నారు.

అలాగే పార్టీలో ప్రత్యేక ఆర్థిక నిధిని కూడా ఏర్పాటు చేసి దానిని కార్యకర్తల సంక్షేమం కోసం వినియోగించాలని కూడా జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. కార్యకర్తలు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఈ నిధిని వినియోగిస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే క్యాడర్ ని నేనున్నాను అని గట్టి భరోసా ఇవ్వడానికి వైసీపీ అధినాయకత్వం సిద్ధంగా ఉందని అంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నపుడు క్యాడర్ ని పూర్తిగా పక్కన పెట్టేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చింది. వారితోనే అంతా అని కధ నడిపించింది. వారు ఉంటే చాలు విజయం తధ్యం అని భావించింది. అయితే వారు సరైన టైం లో సహకారం అందించలేదు. వారి మీద పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయి. ఇటు చూస్తే క్యాడర్ కూడా సహకరించలేదు.

దాంతో వైసీపీ దారుణంగా ఓటమి పాలు అయింది. అందుకే ఇపుడు కార్యకర్తలకు వందనం అనే కొత్త కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టబోతోంది. రాబోయే అయిదేళ్ల పాటు వారితోనే అన్నీ నడిపించాలని కూడా చూస్తోంది. మరి కార్యకర్తలు వైసీపీ మాట వింటారా. పార్టీకి మునుపటి మాదిరిగా అంకితభావంతో సేవ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News