జగన్ నమస్కారానికి ప్రతి నమస్కారం ?
అంతకు ముందు 2014లో దక్కిన విపక్ష నేత హోదాలో లభించిన గౌరవం కూడా కాదు.
అసెంబ్లీలో తొలి రోజు జగన్ కి వింత అనుభవం ఎదురైంది. అది అయిదేళ్ళ క్రితం 2019లో దక్కిన అద్భుతమైన గౌరవాభిమానాలు తరహా కానే కాదు. అంతకు ముందు 2014లో దక్కిన విపక్ష నేత హోదాలో లభించిన గౌరవం కూడా కాదు.
జగన్ అయిదేళ్ళు సీఎం గా అంతకు ముందు అయిదేళ్ళు విపక్ష నేతగా వ్యవహరించాక రాజకీయల్లో పుష్కర కాలం పైగా ఉన్నాక ఆయన అసెంబ్లీకి వస్తే సభ్యుల నుంచి ఆయనకు తిరిగి ఏమి దక్కింది అని చూస్తే వైసీపీ శ్రేణులు చింతించాల్సిందే అని అంటున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తూ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ నమస్కారాలు చేసుకుంటూ వెళ్లారు. అలా ఆయన సీఎం చంద్రబాబు దాకా నమస్కారం పెట్టుకుంటూ వచ్చారు.
అయితే చిత్రంగా జగన్ నమస్కారానికి ప్రతి నమస్కారం అయితే కూటమి నుంచి దక్కకపోవడం విశేషం. అదే సమయంలో సభలో అశేష విశేష అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ సీఎం చంద్రబాబు ఒక్కరె జగన్ నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారు.
అందుకే అక్కడే బాబుకు గ్రేట్ అనాలి. ఆయన రాజకీయాలను అలాగే చూస్తారు. అలాగే ఎవరి మర్యాద వారికి ఇస్తారు. చంద్రబాబు ఈ స్థాయిలో ఎందుకు ఉన్నారు ఎలా ఉన్నారు అన్నది ఒక పుస్తకంగా రాయవచ్చు. ఆయన చూడని ఎత్తులు లేవు, ఆయన చదవని రాజకీయం లేదు. ఆయన జగన్ విషయంలో ఒక మాజీ సీఎం కి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను పూర్తి స్థాయిలో ఇవ్వడం ద్వారా తాను రాజకీయ నేతను మాత్రమే కాదు స్టేట్స్ మెన్ ని అని నిరూపించుకున్నారు.
బాబులో లేనిదే కక్ష సాధించడం. ఆయనకు ఇదే సభలో గత అయిదేళ్లలో జగన్ పాలనలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆఖరుకు ఆయన యాభై మూడు రోజుల పాటు జైలు జీవితం కూడా ఏడున్నర పదుల వయసులో గడిపారు. అయితే చంద్రబాబును ఇంతలా వైసీపీ ప్రభుత్వం వేధించింది అన్న బాధ ఆవేశం అంతా టీడీపీ శ్రేణులలో ఉంది. అదే టీడీపీ కూటమి సభ్యులలో సైతం కనిపించింది. కానీ చంద్రబాబు మాత్రం తన గౌరవాన్ని ఎక్కడా తగ్గించుకోలేదు. సభా నాయకుడిగానే వ్యవహరించారు.
జగన్ కి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చారు ఆయనకు తిరిగి నమస్కారం చేయడం ద్వారా తన సంస్కారాన్ని చాటుకున్నారు. నిజంగా చంద్రబాబు లాంటి వారు సభలో లేకపోతే ఏమవుతుంది అన్నది ఒక్కసారిగా అంతా ఆలోచించుకోవాల్సి ఉంది. ఏపీలో ఇంత సీనియర్ నేత అయిన బాబు వంటి వారు సభలో ఉండడం వల్లనే ఇంకా సభలో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయని విపక్షం సహా అన్ని పక్షాలు ఆలోచించుకోవడమే కాదు ఆయన స్పూర్తితో తాము మారితే అంతకంటే వేరేది ఉండదు. ఏది ఏమైనా అసెంబ్లీలో జగన్ కి ఈ పరిస్థితి రావడం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేనిదే. కానీ ప్రజా తీర్పు అత్యంత కఠినం. దానికి ఎవరైనా బద్ధులుగా ఉండాల్సిందే.