పోలింగ్ దగ్గర చేసి రూట్ మార్చిన జగన్ !

దాంతో ఈ గోల్డెన్ టైం ని సొమ్ము చేసుకునేందుకు జాగ్రత్తగా వాడుకునేందుకు రాజకీయ పార్టీలు అన్నీ పోటీలు పడుతున్నాయి.

Update: 2024-05-05 03:34 GMT

ఏపీలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గట్టిగా చూస్తే ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఇక ఎన్నికల ప్రచారానికి చూస్తే కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో ఈ గోల్డెన్ టైం ని సొమ్ము చేసుకునేందుకు జాగ్రత్తగా వాడుకునేందుకు రాజకీయ పార్టీలు అన్నీ పోటీలు పడుతున్నాయి.

ఇక వైసీపీ అధినేత జగన్ అయితే తన ప్రసంగంలో పదును పెంచారు. రూట్ మార్చారు. గతంలో ఆయన ప్రసంగాలు చూస్తే రొటీన్ గా ఉండేవి. ఇపుడు మాత్రం అందులో దూకుడు పెరిగింది. సబ్జెక్ట్ కూడా కొత్తది ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తో రెడీ చేసి జనానికి డెలివరీ చేస్తున్నారు.

సిద్ధం సభలతో మొదలెట్టి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర దాకా జగన్ మాట్లాడేది ఒకే అంశం మీద పధకాలు పెద్ద ఎత్తున ఇచ్చాం, సంక్షేమానికి మేమే కావాలి. మాకు ఓటు వేయండి అని. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు అని కూడా చెప్పుకొచ్చారు. ఇది డేరింగ్ అండ్ డేషింగ్ ప్రకటనగా మొదట్లో ఉండేది.

కానీ పధకాలు అందని వారు మాత్రం మాకు మంచి జరగలేదు కాబట్టి జగన్ కి ఓటు వేయనక్కరలేదని బాహాటంగానే అనడం మొదలెట్టారు. దాంతో పాటు సంక్షేమం అందిన వారు కూడా పూర్తిగా వేస్తారా లేక చంద్రబాబు కూటమి తీసుకుని వచ్చిన రెట్టింపు హామీల వలలో పడతారా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి.

పైగా పంచుడు బటన్ నొక్కుడు తప్ప ఏపీలో ఏమీ లేదని టీడీపీ సహా విపక్షాలు విమర్శల జోరు పెంచుతున్నాయి. ఏపీలో అభివృద్ధి శూన్యం అని ప్రచారం చేస్తున్నాయి. ఇన్నాళ్ల తరువాత ఆలస్యంగా అయినా వైసీపీకి ఈ విషయంలో బల్బు వెలిగింది అని అంటున్నారు. పైగా ఇటీవల వస్తున్న పలు సర్వేలలో కూడా జనాలు అభివృద్ధి కోరుకుంటున్నారు అని తేలడంతో పాటు టీడీపీ అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రచారం చేసుకోవడంతో తాము పధకాలనే పట్టుకుని వేలాడితే దెబ్బ టింటామని వైసీపీ భావించినట్లుంది.

ఫలితంగా జగన్ స్పీచులు మారాయి. ఇప్పటిదాకా ఆయన స్కీముల గురించే ఎక్కువగా వల్లించేవారు కానీ ఆయన ఇపుడు ఏపీకి గత అయిదేళ్ళలో వైసీపీ ఏమి అభివృద్ధి చేసింది కూడా పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. నెల్లూరు ఎన్నికల ప్రచారంలో అయితే గంట సేపు సాగిన జగన్ ప్రసంగంలో కేవలం అయిదు నిముషాలు మాత్రమే సంక్షేమం, రెండు లక్షల డెబ్బై వేల కోట్ల నగదు బదిలీ గురించి ఉంది.

మిగిలినది అంతా తాము రాష్ట్రానికి ఏమి చేశామని చెబుతూ నెల్లూరు జిల్లాకు ఏమి చేశామని పక్కన ఉన్న ప్రకాశం జిల్లాకు ఏమి చేశామని చెప్పుకొచ్చారు. ఏపీలో నాడు నేడు కింద పాఠశాలలు ఆసుపత్రులు అభివృద్ధి చేసామని నాణ్యమైన విద్యా వైద్యాన్ని అందించామని జగన్ చెప్పారు. అంతే కాదు శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో సూపర్ స్పెషల్ ఆసుపత్రిని నిర్మించామని ఉద్ధానికి వంశధార ద్వారా ఎత్తిపోతల పధకంతో వేయి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాగు నీటి సదుపాయం కల్పించామని చెప్పారు.

రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఫిషింగ్ హార్బర్లు ఇలా ఎన్నో నిర్మాణాలు చేస్తున్నామని అన్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తమ హయాంలో ఎక్కువగా ఏర్పడ్డాయని అలాగే పెట్టుబడులు ఏపీకి చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో ముప్పయి వేల కోట్లు వస్తే తమ పాలనలో లక్ష కోట్లు వచ్చాయని ఆయా పరిశ్రమలు ప్రస్తుతం గ్రౌండింగ్ అవుతున్నాయని జగన్ వివరించారు.

ఇదంతా అభివృద్ధి కాదా అని ఆయన విపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. అంతే కాదు రెండున్నర లక్షలకు పైగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు. మొత్తం మీద చూస్తే రానున్న రోజులలో జగన్ న్యూట్రల్ ఓటర్లతో పాటు పట్టణ ఓటర్లను ఆకట్టుకోవడానికి డెవలప్మెంట్ గురించి తమ ఏలుబడిలో జరిగిన కార్యక్రమాల గురించి చెప్పడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. జగన్ రూట్ మార్చడం వెనక వైసీపీకి అందుతున్న పలు సర్వేలు వాటి నివేదికలే అని కూడా ప్రచారం సాగుతోంది. మరి జగన్ చెబుతున్న అభివృద్ధికి జనాలు సంతృప్తి చెందుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News