175 ఎట్ ఏ టైం... అభ్యర్థుల ప్రకటనకు జగన్ రెడీ!?
ఇప్పటికే అభ్యర్థుల జాబితాకు తుదిమెరుగులు దిద్దే పనులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయని... వీలైనంత తొందర్లోనే ఆ జాబితా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానంగా అధికారపార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలువురు సిట్టింగులకు షాకులు, ఇన్ ఛార్జ్ లకు జలక్కులు తప్పని పరిస్థితి! అయితే... ఇన్ ఛార్జ్ మార్కు కేవలం పనితీరు మాత్రమే ప్రాతిపదిక కాదని.. కొన్నిసార్లు గతంలో బాగా పనిచేసినవారిని కూడా మరికొన్ని సమీకరణల నేపథ్యంలో మార్చాల్సి వస్తుందని చెబుతున్నారని తెలుస్తుంది! ఆ సంగతి అలా ఉంటే... అభ్యర్థుల ప్రకటన విషయంలో జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నట్లుగా అభ్యర్థుల ఎంపికలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి... మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాకు తుదిమెరుగులు దిద్దే పనులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయని... వీలైనంత తొందర్లోనే ఆ జాబితా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఈ క్రమంలో ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలను తొలగించిన తర్వాత.. కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు, మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల బంధువులకు స్థానం కల్పించడంతో పాటు.. ఇంకొంతమంది లోక్ సభ సభ్యులతో సహా 38 మంది అభ్యర్థులతో కూడిన రెండు జాబితాలపై క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే!
ఇదే సమయంలో సోమవారం నందికొట్కూరు, మార్కాపురం, విజయనగరం, దోనె నియోజకవర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పిలిపించి వారితో ముమ్మరంగా చర్చలు జరిపారని తెలుస్తుంది. అదేవిధంగా... తాడికొండలో పార్టీ ఇన్ చార్జి పదవిని కోల్పోయిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణికే వరప్రసాద్ కూడా జగన్ ను కలిసేందుకు తాడేపల్లికి వచ్చారని అంటున్నారు. ఈయన గత కొంతకాలంగా కాస్త అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే!
మరోపక్క అసంతృప్త నేతలతో అటు ధనుంజయ్ రెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. టిక్కెట్లు దక్కకపోవడం, మార్పులు చోటు చేసుకోవడం వంటి నిర్ణయాల వెనుక ఉన్న వ్యూహాలను, పరిస్థితులను అర్ధం చేసుకోమని అర్ధమయ్యేట్లు చెప్పారని తెలుస్తుంది. ఇలా చర్చలు జరిపిన వారిలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఉన్నారని సమాచారం.
ఏది ఏమైనా... సరైన సమయం చూసుకుని వైఎస్ జగన్ ఒకేసారి 175 మంది అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని.. అనంతరం ఇక పూర్తిగా ప్రజల్లోకి వచ్చే దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది! కాగా ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.