ప్రధాని నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి సీరియస్ లేఖ

- కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏపీలో 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి

Update: 2024-07-19 07:30 GMT

ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు తగ్గిపోయాయని.. టీడీపీ నేతలు.. క్యాడర్ దాడులకు పాల్పడుతుందని.. లా అండ్ ఆర్డర్ విషయంలో ఘోర వైఫ్యలం నెలకొందన్న ఆరోపణలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా.. కూటమి ప్రభుత్వం పైనా పలు ఆరోపణలు చేశారు. సంచలనంగా మారిన ఈ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఏయే అంశాల్ని ప్రస్తావించారు? అన్న విషయాల్లోకి వెళితే..

జగన్ లేఖలోని ముఖ్యాంశాలివే..

- కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏపీలో 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ నేతల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

- 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు.. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దాదాపు 2700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. ఇవి కాకుండా 1050కు పైగా దౌర్జన్యాలు.. దాడుల ఘటనలు జరిగాయి. ఏపీలో ఏకంగా దాదాపు 27 మంది ఐఏఎస్ లు.. 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా చేశారు.

- ఇవన్నీ అనుకోకుండా జరిగినవి కావు. వైసీపీని అణగదొక్కేందుకు వీలుగా ఒక పథకం ప్రకారం చేసిన దుర్మార్గాలు. రాజకీయంగా వైసీపీ తరఫున ఎవరూ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వంలో ఉన్న వారు కిందిస్థాయి వరకూ అధికారులకు సంకేతాలు పంపారు.

- ఒక మంత్రి రెడ్ బుక్ పేరుతో ఏకంగా హోర్డింగులు పెట్టి నేరుగా దాడులు చేయాలని శ్రేణులకు చెప్పకనే చెబుతున్నారు. వాటిని అడ్డుకోవద్దని అధికారులకు సంకేతాలు ఇవ్వటంతో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు.

- రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి. తక్షణం శాంతి స్థాపన జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగించిన దురాగతాలను మీకు చెప్పేందుకు వీలుగా మీ సమయాన్ని ఇవ్వాలి.

- ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయటమే కాదు.. వారి ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. పార్టీ నేతలు.. కార్యకర్తల ఆస్తులే కాదు.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వ్యవస్థల్ని ధ్వంసం చేయటమే లక్ష్యంగా సాగుతోంది.

- వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను నడిరోడ్డు మీద దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లిన మా ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి.

- రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించట్లేదు. రాజ్యాంగం.. చట్టం లేదు. పోలీసు వ్యవస్థ పని చేయట్లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని రెడ్ బుక్ రాజ్యాంగానికి వదిలేశారు. గత ఐదేళ్లలో ఏపీ అంటే ఉత్తమ విద్య.. నాణ్యమైన వైద్యం.. రైతుకు భరోసా.. అక్కచెల్లమ్మలకు సాధికారిత.. పటిష్ట లా అండ్ ఆర్డర్.. సుస్థిర సమగ్ర అభివ్రద్ధికి నిలయమని పేరు. ఇప్పుడు ఏపీ అంటే హత్యలు.. అత్యాచారాలు.. రాజకీయ దాడులు.. విధ్వంసాలకు చిరునామాగా మారింది.

Tags:    

Similar News