ఓటమి పోస్ట్ మార్టం...జగన్ తో నేతల భేటీలు !
అంతే కాదు సరైన కారణాలు చెప్పి ఒప్పుకునేందుకు మనసుకు కూడా మనసు రాదు.
ఎందుకు ఓడాం ఎలా ఓడాం, ఇదే వైసీపీని వేధిస్తున్న ప్రశ్న. కారణాలు అంతు చిక్కడం లేదు. విజయానికి ఎంతో మంది తండ్రులు ఉంటారు. అపజయం అనాధ అని చెబుతారు. అలా చూస్తే వైసీపీ నేతలకే కాదు ఓడిన ఏ పార్టీకి కూడా కారణాలు అయితే సరిగ్గా దొరకవు. అంతే కాదు సరైన కారణాలు చెప్పి ఒప్పుకునేందుకు మనసుకు కూడా మనసు రాదు.
అందుకే మధనం ఎంత చేసినా ఎంతగా పోస్ట్ మార్టం చేసినా చివరికి అవి ఓదార్పులకే పరిమితం అవుతాయి అని అంటారు. అయితే ఓటమి జరిగిన తరువాత సమీక్ష అవసరం. అలా చూస్తే కనుక తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుని వైసీపీ ప్రధాన కార్యాలయంగా మర్చిన జగన్ వరసబెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో అన్నీ పంచుకుంటున్నారు. వారు చెప్పినది వింటున్నారు ఎందుకు ఓడామన్నది వారిని అడిగి తెలుసుకుంటున్నారు. తన మనసులో ఏముందో చెబుతున్నారు. అంతా మంచి జరుగుతుందని కూడా ధైర్యం చెబుతున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఒక వైపు టీడీపీ నేతలు జనసేన బీజేపీ నాయకులు అంతా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమలో ఫుల్ బిజీగా ఉంటే తాడేపల్లిలోని జగన్ వైసీపీ ఆఫీసులో కీలక నేతలతో తనదైన పోస్ట్ మార్టం ని కొనసాగిస్తున్నారు.
తాజాగా జగన్ తో భేటీ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలు ధర్మాన ప్రసాదరావు, క్రిష్ణదాస్, అలాగే గోదావరి జిల్లాకు చెందిన నేతలు కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు రెడ్డి శాంతి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వంటి వారు ఉన్నారు.
ఈ సందర్భంగా పార్టీ పరిస్థితి పైనా వైసీపీ నేతలు కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల మీద సమావేశంలో చరించారు. రానున్న రోజులలో ఎలా వైసీపీని పటిష్టం చేయాలి దాడులను ఎదుర్కొని క్యాడర్ కి ఎలా రక్షణ కల్పించాలి అన్న దాని మీద కూడా చర్చించారు. మొత్తం మీద చూస్తే ప్రతీ రోజూ సమీక్షలతో జగన్ ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఈ సమీక్షల ఫలితం ఏమిటి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది జగన్ ఏమి డిసైడ్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.